
పెరిగిన విద్యుత్ వినియోగం
● నిత్యం 2 మిలియన్ యూనిట్ల మేర అదనంగా వాడకం ● అధిక ఉష్ణోగ్రతలు, యాసంగి పంటల సాగే కారణం
జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల వివరాలు
గృహ కనెక్షన్లు 4,92,745
వ్యవసాయ కనెక్షన్లు 1,18,267
పరిశ్రమలు 65,822
ఇతరాలు 12,839
మొత్తం 6,89,673
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలతో గృహ వినియోగం బాగా పెరగడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు ఈ ఏడాది కురిసిన వర్షాలతో జలాశయాలు, భూగర్బంలో నీరు సమృద్ధిగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. మరోవైపు గ్రానైట్, ఇతర పరిశ్రమలు కూడా ఉండడంతో విద్యుత్ వినియోగం సాధారణానికి మించింది. జిల్లాలో ఉన్న విద్యుత్ కనెక్షన్లు, వినియోగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని టీజీ ఎన్పీడీసీఎల్ జిల్లాకు నిత్యం 6.96 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోటాను నిర్దేశించింది. ఫిబ్రవరి మూడో వారం వరకు జిల్లాలో దాదాపు కోటా మేరకు విద్యుత్ వినియోగం జరగగా నాలుగో వారం నుంచి ఇప్పటివరకు కేటాయంచిన యూనిట్లకు మించి విద్యుత్ అవసరమవుతోంది.
నిత్యం 2 మిలియన్ యూనిట్ల వరకు అదనం..
ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో మార్చి నెల ఆరంభం నుంచి నిత్యం సంస్థ నిర్దేశించిన కేటాయింపులకు మించి 2 మిలియన్ల విద్యుత్ విద్యుత్ వినియోగం జరుగుతోంది. జిల్లాకు రోజుకు విద్యుత్ కోటా 6.96 మిలియన్ యూనిట్లు కాగా, 8.70 నుంచి 9.09 మిలియన్ యూనిట్ల వరకు వినియోగిస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతలు, యాసంగి పంటలు..
మార్చి ఆరంభం నుంచి 35 – 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఫ్యాన్లు, ఏసీల వాడకంతో ప్రధానంగా గృహ వినియోగం గణనీయంగా పెరిగింది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు గృహ వినియోగం అధికంగా ఉంటుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. పగటి వేళల్లో కూడా గృహ విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. దీనికి తోడు జిల్లాలో నీటి వనరుల ఆధారంగా యాసంగి పంటలను సాగు చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టు భూముల్లో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. జిల్లా మొత్తంలో 2 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నారు. సాగర్ కాల్వల నుంచి వానబందీ పద్ధతిలో నీరు విడుదల చేస్తుండగా రైతులు తమ భూముల్లో బోర్లు వేసుకొని భూగర్భ జలాలను కూడా వినియోగించుకుంటున్నారు. మార్చిలో పంటలు చివరి దశలో ఉండడంతో నీటి వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. దీనికి తోడు జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ ప్రభావం కూడా విద్యుత్ వినియోగం పెరగడానికి కారణమని చెప్పవచ్చు.
మార్చిలో కోటాకు మించి 2 మిలియన్ యూనిట్లకు పైగా వినియోగించిన రోజులిలా..
తేదీ అదనపు
వినియోగం
మార్చి 2న 2.07
4న 2.13
7న 2.06
9న 2.02
12న 2.26
13న 2.16
15న 2.09
16న 2.22
17న 2.04
18న 2.10
19న 2.05
21న 2.03