ఖమ్మంవ్యవసాయం: రైతుభరోసా పథకం ద్వారా పంటల పెట్టుబడికి రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. జిల్లాలోని 59,061 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం రూ.60.87 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఐదెకరాల మేర సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ కొనసాగుతోందని సమాచా రం. జిల్లాలో రైతు భరోసా పథకానికి 3,51,592 మంది రైతులను అర్హులుగా గుర్తించగా. ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.371.06 కోట్లు జమ కావాల్సి ఉంది. ఇప్పటివరకు 2,65,392మంది రైతులకు రూ.215.78 కోట్లు అందాయి. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ఎంపిక చేసిన గ్రామాల్లో అందరు రైతులకు నగదు జమ చేయగా.. మిగిలిన గ్రామాల్లో ఎకరం భూమి మొదలు నగదు జమ చేస్తోంది. ఫిబ్రవరి 13వ తేదీవరకు మూడెకరాల లోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఆతర్వాత నిలిచిపోవటంతో రైతుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఇంతలోనే ఐదెకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుండగా.. ఈనెలాఖరు నాటికి అర్హులైన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతుందని చెబుతున్నారు. జిల్లాలో ఇంకా 86 వేల మంది రైతులకు వారికి ఉన్న భూమి ఆధారంగా రూ.156 కోట్ల సాయం అందాల్సి ఉంది.
మరో 59 వేల మందికి
రూ.60.87 కోట్లు జమ