ఎర్రుపాలెం/ముదిగొండ: ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకానున్నాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ బుధవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈసందర్భంగా చిత్రపటం, ప్రసాదాలు అందజేసి ఏర్పాట్లను వివరించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు వంశీ, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ముదిగొండ మండలం ముత్తారంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి హాజరుకావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు హైదరాబాద్‌లో ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈమేరకు ఉత్సవాల పోస్టర్లను డిప్యూటీ సీఎం ఆవిష్కరించగా.. ఆలయ ఈఓ సమత, ప్రధాన అర్చకులు బొర్రా వాసుదేవాచార్యులు, శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ చైర్మన్ తుళ్లూరి జీవన్, సభ్యులు తిరపయ్య, వీరభద్రం, బుచ్చయ్య, నాయకులు అజయ్ పాల్గొన్నారు.
వచ్చేనెల 7నుంచి
ఎస్సెస్సీ మూల్యాంకనం
ఖమ్మం సహకారనగర్: పదో తరగతి వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం వచ్చేనెల 7వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈమేరకు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో వాల్యూయేషన్ క్యాంప్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షల జవాబుపత్రాలు వివిధ జిల్లాల నుంచి బుధవారం ఇక్కడకు చేరగా స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరిచారు.
ప్రశాంతంగా
ఎస్సెస్సీ పరీక్షలు
పరిశీలించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వెల్లడించారు. ఖమ్మం రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని బుధవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు సమకూరుస్తున్నామని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ కె.శేఖర్‌రావు, డిపార్ట్‌మెంటల్ అధికారి ఎన్.శ్రీనివాసచారి, సిట్టింగ్ స్క్వాడ్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, బుధవారం జరిగిన గణితం పరీక్షకు జిల్లాలో 16,417మంది విద్యార్థులకు గాను 16,388మంది హాజరు కాగా 29మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు.
సాగుకు నీటి కొరత
ఉండదు..
తిరుమలాయపాలెం: జిల్లాలో సాగు అవసరాలకు మరో ఇరవై రోజుల వరకు నీటి కొరత ఉండదని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. మండలంలోని దమ్మాయిగూడెం, ఏలువారిగూడెం, బీరోలు, బచ్చోడు తదితర గ్రామాల్లో బుధవారం ఆయన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల స్థితిగతులు, నీటి లభ్యతపై ఆరా తీసిన ఆయన నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. తద్వారా వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కాగా, ఏప్రిల్ 1నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. కూసుమంచి ఏడీఏ బి.సరిత, ఏఓ సీతారాంరెడ్డి, ఏఈఓ లంక రమేష్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎంకు బ్రహోత్సవాల ఆహ్వానం
డిప్యూటీ సీఎంకు బ్రహోత్సవాల ఆహ్వానం