సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘జిల్లాలో పైలట్‌గా గుర్తించిన 21 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జనవరి 26న ప్రారంభించాం. ఆయా గ్రామాల్లో 850 మంది లబ్ధిదారుల ఇళ్లు గ్రౌండింగ్ చేస్తుండగా, మున్సిపాలిటీలు, మిగతా గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతోంది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కారమయ్యేలా ప్రచారం చేస్తున్నాం. ధాన్యం కొనుగోళ్లు, రేషన్‌షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరాకు సిద్ధమయ్యాం. వేసవిలో తాగునీటి సరఫరాలో అవాంతరాలు ఎదురుకాకుండా ప్రణాళికలు రూపొందించాం’ అని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఏ పథకం అమలు చేసినా అంతిమంగా పేదరికమే అర్హతగా లబ్ధిదారుల గుర్తింపు ఉంటుందని కలెక్టర్ పేర్కొనగా, ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే...
ఇందిరమ్మ లబ్ధిదారులకు రుణాలు.. అవసరమైతే అద్దె కూడా..
పాత లబ్ధిదారులకూ అవకాశం..
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గతంలో సగం నిర్మించి, బేస్‌మెంట్ అయినవి ఉన్నాయి. 800మంది వరకు ఉండగా.. వీరికి ఈసారి పథకం వర్తింపజేయవచ్చా, చేస్తే నగదు మంజూరవుతుందా లేదా అని పరిశీలించి అమలుకు కృషి చేస్తాం. ఏప్రిల్ మొదటి వారంలోగా ఇది పూర్తిచేసేలా 18 గ్రామాలకు ఇప్పటికే పరిశీలించాం. తాపీ మేసీ్త్రలకు శిక్షణ పూర్తికాగా, రూ.5లక్షల్లోనే నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రతీ సోమవారం మోడల్ హౌస్‌కు వద్దకు తీసుకెళ్లాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి సూచించాం.
ఎల్‌ఆర్‌ఎస్‌పై విస్తృత ప్రచారం
ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి 92వేల దరఖాస్తుల్లో మూడు నెలల కింద 10వేలు, ప్రస్తుతం 36వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. కానీ 3వేల మందే ఫీజు చెల్లించారు. ప్రస్తుతం స్పందన పెరుగుతోంది. ఎల్‌ఆర్‌ఎస్ వల్ల లాభాలను స్థల యజమానులకు వివరిస్తున్నాం.
జల్లెడ పట్టాకే బస్తాల్లోకి ధాన్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో 345 ఏర్పాటు చేస్తుండగా.. గతంలో ఐకేపీ ద్వారా 60 ఉంటే 147కు పెంచాం. ఈసారి 200కు చేరుస్తుండడంతో మహిళా సంఘాల సభ్యులకు కమీషన్ వస్తుంది. ఏ ప్రాంత రైతులు అక్కడే ధాన్యం అమ్ముకునేలా పరిశీలించాలని అధికారులకు సూచించాం. రైతు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఏఈఓ పరిశీలించాక సాగు విస్తీర్ణం, దిగుబడి అంశాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. జల్లెడ పట్టాకే బస్తాల్లో నింపాలని చెబుతుండడంతో మిల్లర్లు ఒక్క కిలో కూడా కోత విధించే అవకాశం ఉండదు. కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తే నగదు చెల్లింపుల్లోవేగం పెరుగుతుందని సూచించాం.
సమృద్ధిగా తాగునీరు
ఈ వేసవిలో తాగునీటి సరఫరాలలో ఇబ్బంది రాకుండా మూడు నెలల క్రితమే ప్రణాళిక సిద్ధం చేశాం. గత ఏడాది ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కొరత ఎదురైనా ఈసారి పాలేరులో సరిపోయేంత నీటి నిల్వలు కొనసాగిస్తున్నాం. ఐదు రోజుల క్రితం ఈ అంశంపై చర్చించాం. గతంలో ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల దగ్గర నాలుగైదు గ్రామాలకు ఇబ్బంది వచ్చింది. కట్టలేరు వద్ద మరమ్మతుల సమయంలో పైపులైన్లు దెబ్బతిన్నాయి. ఈసారి అలా జరగకుండా చూస్తున్నాం. ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉంటే ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సిబ్బందికి సూచించాం.
ధాన్యం కొనుగోళ్లకు
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
రేషన్ దుకాణాల ద్వారా
పంపిణీకి సన్న బియ్యం రెడీ
వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ప్రణాళిక
కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్
సరిపడా సన్నబియ్యం
జిల్లాలో సన్న బియ్యం నిల్వలు సరిపడా ఉన్నాయి. అంతకుముందు లక్ష మెట్రిక్ టన్నులు ఉంటే.. పోయిన సీజన్‌లో 2లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాం. ఇందులో 1.7 లక్షల మెట్రిక్ టన్నులు సన్న బియ్యమే. ఈసారి కూడా 80 శాతం సన్న బియ్యం వస్తాయి. దీంతో వచ్చేనెల 1నుంచి రేషన్ షాప్‌ల ద్వారా సన్న బియ్యం పంపిణీకి అవాంతరాలు ఎదురుకావు.
అద్దె కట్టలేకపోతే మేం కడతాం..
తొలిదశగా 21 జీపీల్లో 850 మంది ఇందిరమ్మ లబ్ధిదారులు ఉండగా.. 500కు పైగా ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తయితే రూ.లక్ష బిల్లు అందుతుంది. కానీ సరిపడా నగదు లేక 367 మంది ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించాం. వీరిలో 290 మందికి మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష చొప్పున రుణం ఇప్పించాం. ఇక ఒంటరి మహిళలు ఉన్న జాగాలోనే ఇల్లు కట్టుకోవాల్సి ఉండడం.. అందుకోసం ప్రస్తుత నివాసాన్ని కూల్చి రావడంతో అదే గ్రామంలో అద్దెకు ఉండాలని చెబుతు న్నాం. అద్దె కట్టుకోలేని స్థితి ఉంటే మేమే కడతాం. ఇక ఇంటి నిర్మాణ పనుల పర్యవేక్షణను కార్యదర్శికి అప్పగిస్తాం.