కల్లూరురూరల్: గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించి ఎక్కువ ధరకు అమ్ముతుంటే వచ్చే డబ్బు సరిపోవడం లేదని, ఏకంగా బియ్యాన్ని చోరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు కల్లూరులో శుక్రవారం ఏసీపీ ఏ.రఘు వివరాలు వెల్లడించారు. వైరా మండలం గోవిందపురానికి చెందిన ఓర్సు హన్మంతరావు, ఓర్సు కృష్ణ(దొర) కొన్నేళ్లుగా రేషన్ బియ్యాన్ని కొన్నాళ్లుగా అక్రమంగా కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. అయితే, ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేందుకు బియ్యం చోరీ చేయాలని నిర్ణయించుకుని వైరా మండలం కలకొడిమకు చెందిన నల్ల బోతుల ఉదయ్, వెలిశాల చందు, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నెమలికి చెందిన అశోక్ లేలాండ్ డ్రైవర్లు గరిడేపల్లి జగదీష్, సాయితో జత కట్టారు. ఈమేరకు హన్మంతు, కృష్ణ చిన్నకోరుకొండిలోని రేషన్ షాపు చోరీకి అనువుగా ఉంటుందని గుర్తించారు. ఈసందర్భంగా ఉదయ్, చందు, జగదీష్‌లు దాచారం నుంచి కూలీలను రప్పించి 16న అర్ధరాత్రి షాప్ తాళాలు పగులగొట్టి 150 బస్తాల రేషన్ బియ్యం(90 క్వింటాళ్లు)ను రెండు వ్యాన్లలో తీసుకెళ్లారు. ఆపై కేజీ రూ.20 చొప్పున విక్రయించగా మిగిలిన 35 క్వింటాళ్ల బియ్యాన్ని కూరాకుల మురళి ఇంట్లో నిల్వ చేశారు. ఈ విషయమై అందిన సమాచారంతో శుక్రవారం నెమలిలో మురళి ఇంటి వద్ద ఆయనతో పాటు హన్మంతు, జగదీష్, ఉదయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా రూ.30వేల నగదు, అశోక్ లేలాండ్ వాహనం, 110 ఖాళీ సంచులను స్వాధీనం చేసుకుని ఓర్సు దొర, చందు, బియ్యం కొనుగోలు చేసిన ఖాతారెడ్డి, నర్సింహారావు కోసం గాలిస్తున్నామని ఏసీపీ తెలిపారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తిలింగయ్య, ఎస్సై హరిత, సిబ్బందికి ఏసీపీ రివార్డులు అందజేశారు.
180 బస్తాల రేషన్ బియ్యం
చోరీ కేసులో నిందితుల అరెస్ట్