పెద్దాస్పత్రిలో కార్మికుల సమస్యకు పరిష్కారం
కాంట్రాక్టర్‌కు పెండింగ్ బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశం
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కార్మికుల వేతనాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పెండింగ్ బిల్లులు చెల్లించడమే కాక బెడ్ల సంఖ్య పెంచాలని కోరుతూ కాంట్రాక్టర్ హైకోర్టులో కేసు దాఖలు చేయగా, విచారణ అనంతరం ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
పడకలు తగ్గడంతో...
పెద్దాస్పత్రిలోని వివిధ విభాగాల్లో 259 మంది కార్మికులు పనిచేస్తుండగా.. నిర్వహణ బాధ్యతలను చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీకి అప్పగించారు. ప్రభుత్వం నుంచి సంస్థకు, వారి ద్వారా సెక్యూరిటీ, శానిటేషన్, పేషంట్ కేర్ కార్మికులకు వేతనాలు చెల్లిస్తారు. అయితే నెలనెలా సక్రమంగా జీతాలు రాక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వీరికి నెలకు రూ.14,500 మంజూరు చేస్తుండగా కటింగ్ పోను రూ.13వేలు ఖాతాలో జమ చేస్తారు.
ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నప్పుడు 575 పడకలకు అనుమతి ఉండేది. ఆ సామర్ధ్యం మేర రూ.50,88,239 చెల్లించేవారు. అయితే 2023 నవంబర్ నుండి పెద్దాస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్(డీఎంఈ) పరిధిలోకి వెళ్లాక 430 పడకలే పరిగణనలోకి తీసుకుంటూ చెల్లిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్‌కు రూ.35.40లక్షలే వస్తుండగా, గతంతో పోలిస్తే రూ.15,48,239 తగ్గడంతో కార్మికులకు వేతనాల చెల్లింపులో ఇక్కట్లు ఎదురవుతున్నాయి.
నెలల పాటు ఎదురుచూడడం, ఆందోళన చేసినప్పుడు ఒక నెల వేతనం ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో కాంట్రాక్టర్ హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు ద్వారా సమస్యకు పరిష్కారం లభించింది. ఇకపై ప్రతీనెల కాంట్రాక్టర్‌కు పూర్తిస్థాయిలో చెల్లించడమేకాక 2023 నవంబర్ నుండి ఉన్న బకాయిలు కూడా విడుదల చేయనున్నారు. కోర్టు తీర్పు ఆధారంగా రూ.2,63,20,063ను కాంట్రాక్టర్‌కు చెల్లించాలని ఉత్తర్వులు సైతం విడుదలయ్యాయి.