
భూసమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి
● గ్రామ పాలన అధికారులు, భూభారతి చట్టంతో పరిష్కారం ● రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: గ్రామాల్లో రైతులు, ప్రజలు భూసమస్యల పరిష్కారం కోసం ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నందున ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి వెల్లడించారు. ఖమ్మంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూభారతి చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈక్రమంలోనే 10,954 గ్రామ పాలన అధికారుల(జీపీఓ) పోస్టులు మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాక పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలను తిరిగి మాతృసంస్థలోకి తీసుకురావడానికి సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. అలాగే, తొలిసారి 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల మంజూరు, తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు కోల్పోయిన అధికా రాలు భూభారతి చట్టంతో పునరుద్ధరణ జరిగా యని తెలిపారు. గతంలో జీఓ 317తో దంపతులైన ఉద్యోగులు చిన్నాభిన్నం కాగా, జేఏసీ ఉద్యమ ఫలితంగా స్పౌజ్, మెడికల్, తదితర కోణాల్లో బదిలీలను చేపట్టిందని చెప్పారు. గ్రామ పాలన అధికారుల రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్ర రావు మాట్లాడుతూ గత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వీఆర్వోలు, వీఆర్‌ఏలను అన్యాయంగా అర్ధరాత్రి లాటరీ పద్ధతిలో వివిధ శాఖలకు కేటాయించిన గత ప్రభుత్వం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జేఏసీ సారధ్యాన వీఆర్వోలకు పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉద్యోగులు, సంఘాల నాయకులు డీఎస్.వెంకన్న, మంగీలాల్, బుచ్చయ్య, కోట రవికుమార్, పాక రమేష్, పూల్‌సింగ్ చౌహన్, శ్రీనివాస్, శంకర్‌రావు, ప్రేమ్‌కుమార్, వజ్జ రామారావు, వాంకుడోత్ వెంకన్న, పాండునాయక్, సలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
●రిటైర్డ్ ఆర్డీఓ పొట్టపెంజర రాజారావు ఇటీవల మృతి చెందగా ఆయన చిత్రపటం వద్ద లచ్చిరెడ్డి నివాళులర్పించారు. అలాగే, ఆయన కుటుంబీకులను పరామర్శించాక మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా నిజాయితీగా సేవలందించడమేకాక రెవెన్యూ పత్రిక నిర్వహించడంలో రాజారావు కీలకంగా వ్యవహరించారని కొనియాడారు.