
ఉగాది ఉషస్సు.. విశ్వావసు
● జిల్లావ్యాప్తంగా ఘనంగా వేడుకలు ● వ్యవసాయ పనులు ప్రారంభించిన అన్నదాతలు ● ఆలయాల్లో పంచాంగ శ్రవణం
ఆసిఫాబాద్: జిల్లావ్యాప్తంగా ఆదివారం విశ్వావసు నామ ఉగాది వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మార్కెట్లు సందడిగా మారాయి. ఇంటి ముంగిళ్లను మామిడి తోరణాలతో అలంకరించారు. కొత్త బట్టలు ధరించి ఆలయాలను దర్శించుకున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కేశవనాథ ఆలయం, శివకేశవ మందిర్, షిర్డీ సాయి మందిరంలో అర్చకులు ఇందారపు మధూకర శర్మ పంచాంగ పఠనం చేశారు. పల్లెల్లో రైతులు వ్యవసాయ పనిముట్లు, ఎద్దులకు ప్రత్యేక పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది పచ్చడి సేవించి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో, బస్టాండ్‌లో డీఎం రాజశేఖర్ ప్రయాణికులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అంబేడ్కర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రూప్‌నర్ రమేశ్ ఉగాది పచ్చడిని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం బాలేశ్, మిట్ట తిరుపతి, బట్టుపెల్లి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఉగాది ఉషస్సు.. విశ్వావసు

ఉగాది ఉషస్సు.. విశ్వావసు