
రామవరప్పాడు: ఉద్యోగం కోసం న్యూజిల్యాండ్ వెళ్లాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆ యువకుడు కన్న కలలను విద్యుదాఘాతం చిదిమేసింది. వర్కింగ్ వీసాతో పాటు విమాన టిక్కెట్లు కూడా సమకూర్చుకున్న ఆ యువకుడి నిండు ప్రాణాలను బలితీసుకుంది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు జెండా చెట్టు సెంటర్ రోడ్డులో దర్శినాల శంకర్, రమణ దంపతులు నివాసం నివసిస్తు న్నారు. వారికి దర్శినాల వినోద్ కుమార్ (30), ప్రమోద్ సంతానం. చిన్న కుమారుడు వినోద్‌కుమార్ తల్లిదండ్రులు, భార్య సంధ్యతో కలిసి గ్రామంలో ఓ అపార్టుమెంట్ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు.
సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకుని బాల్కనీలో కాళ్లు శుభ్రం చేసుకుంటుండగా ప్రమాదవశాత్తూ పిట్ట గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై వినోద్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.
న్యూజిల్యాండ్ వెళ్లాల్సి ఉండగా విషాదం
ఈ నెల చివర వినోద్‌కుమార్ ఓ కంపెనీలో పని చేసేందుకు న్యూజిల్యాండ్ వెళ్లాల్సి ఉంది. ఇందు కోసం వర్కింగ్ వీసాతో పాటు విమాన టిక్కెట్లు కూడా సమకూర్చుకున్నాడు. గతంలో వినోద్‌కుమార్ గ్రామంలో చికెన్ షాపు నిర్వహించేవాడు. న్యూజిల్యాండ్‌లో మంచి ఉద్యోగ అవకాశం రావడంతో స్నేహితులతో కలిసి వెళ్లాడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో మృత్యువు విద్యుదాఘాతం రూపంలో కబళించిందని వినోద్ భార్య సంధ్య, తల్లిదండ్రులు శంకర్, రమణ కన్నీరుమున్నీరుగా విలపించారు.
బాల్కానీ వద్ద విద్యుత్ తీగలు చేతికందే దూరంలో ప్రమాదకరంగా ఉన్నాయని, రక్షణ ఏర్పాట్లు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యుల వద్ద వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment