క్రమం తప్పకుండా కంటి పరీక్షలు
విజయవాడస్పోర్ట్స్: మందగించే కంటి చూపు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని, దృష్టి లోపం ఉన్న వారు ఆరు నెలలకొకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని డ్రైవర్లకు డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎ.మోహన్ సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఎంజీ రోడ్డులోని డీటీసీ కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించారు. డీటీసీ మాట్లాడుతూ కంటి, బీపీ, షుగర్, సాధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని డ్రైవర్లకు సూచించారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు వాహనాలు నడపొద్దని, దృష్టి లోపాలతో దూరం నుంచి వచ్చే వాహనాలను గమనించలేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దృష్టి లోపం ఉన్న డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులను వాడటం, కంటి అద్దాలను వినియోగించాలన్నారు. డీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి 300 మందికిపైగా డ్రైవర్లు హాజరయ్యారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీవో ఆర్.ప్రవీణ్, కె. వెంకటేశ్వరరావు, మోటార్ వాహన తనిఖీ అధికారులు పి.వి.రమణ, వై.నాగేశ్వరరావు, మహమ్మద్ అలీ, ఏవో అబ్దుల్ సత్తార్, సత్యనారాయణ, ఏపీ రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, రోడ్ సేఫ్టీ ఎస్‌ఐ త్రిమూర్తులు, డాక్టర్ తేజ, వరుణ్ హెల్త్ సెంటర్ వైద్య బృందం పాల్గొన్నారు.
బుక్ కీపర్లకు అందిన గౌరవం
పెడన: వెలుగు ఆధ్వర్యాన గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న బుక్ కీపర్లకు నాలుగు నెలల గౌరవవేతనం విడుదలైంది. ఈ నెల 22న ‘సాక్షి’లో వేతనాలు అందక బుక్ కీపర్లు పడుతున్న ఇబ్బందులపై ‘బుక్ కీపర్లకు అందని గౌరవం’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఉన్నతాధికారులు స్పందించి వారికి రెండు నెలలు వేతనం నేరుగా వారి ఖాతాలకు జమ చేశారని, మరో రెండు నెలలకు సంబంధించి గ్రామ సమాఖ్యలకు నిధులు విడుదల చేశారని పెడన ఏరియా కోఆర్డినేటర్ రవిబాబు తెలిపారు. నాలుగు నెలల వేతనాలను ఫిబ్రవరిలో అందుకుంటారని, మిగిలిన వాటికి సంబంధించి నివేదికలు కూడా పంపించామని ఆయన పేర్కొన్నారు.
అవగాహనతో
కుష్ఠు నిర్మూలన
పాయకాపురం(విజయవాడరూరల్): కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కుష్ఠు వ్యాధి నివారణ అధికారి, టీబీ అధికారి డాక్టర్ జె.ఉషారాణి వైద్య సిబ్బందికి సూచించారు. రాజీవ్‌నగర్లోని ప్రాంతీయ ఆయుర్వేద రీసెర్చి కేంద్రంలో గురువారం గాంధీ వర్ధంతి సందర్భంగా కుష్ఠు వ్యాధి నిర్మూలన అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్ జె.ఉషారాణి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి 200 కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాలు వచ్చేనెల 13 వరకు జరుగుతాయన్నారు. ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వంద రోజుల క్షయవ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వి.రాథోడ్, రీసెర్చీ అధికారి డాక్టర్ ఏజేవీ సాయిప్రసాద్, ఎన్‌టీఈపీ సిబ్బంది, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పీపీఎం లీలాకుమార్, డీపీఎస్ తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో
పీఎం సూర్యఘర్ హెల్ప్‌లైన్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్‌గా తీర్చిదిద్దడానికి కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పథకం వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకొనేందుకు ఔత్సాహికులు హెల్ప్‌లైన్ 62817 09398 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. ప్రజలు పథకంపై సలహాలు సూచనలు పొందడానికి ఈ హెల్ప్‌లెన్ నంబర్ సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment