
ఎన్నికల నియమావళి తప్పనిసరి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణ–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. ఆయన చాంబర్‌లో గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేస్తారని, 10వ తేదీన నామినేషన్ వేసేందుకు చివరితేదీ అన్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఫిబ్రవరి 20న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు అదే నెల 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. జిల్లాలో జనవరి 29వ తేదీ నాటికి 63,143 మంది ఓటర్లు నమోదయ్యారని వీరిలో 35,343 మంది పురుషులు, 27,796 మంది మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్లలో ముసాయిదా జాబితా ప్రకారం 76 పోలింగ్ స్టేషన్లు సిద్ధంగా ఉంచామన్నారు. మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. జిల్లాలో స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ షేక్ సలార్‌దాదా, బీజేపీ నేత పీవీ గజేంద్ర, సీపీఎం నేత కొడాలి శర్మ, కాంగ్రెస్ నేత అబ్దుల్‌మతీన్, ఎన్నికల విభాగం డెప్యూటీ తహసీల్దార్ ఎంవీ శ్యామ్‌నాథ్, కో–ఆర్డినేషన్ సెక్షన్ డెప్యూటీ తహసీల్దార్ నారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment