నవదిన ప్రార్థనలు ప్రారంభం
పెద్ద సంఖ్యలో హాజరైన
మఠకన్యలు, క్రైస్తవ విశ్వాసులు
గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడలోని గుణదల పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాల నవదిన ప్రార్థనలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి రాజారావు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తదితర గురువులు ప్రధానాలయం వద్ద మరియమాత పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు మాట్లాడుతూ జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ 2025ను జూబ్లీ సంవత్సరంగా ప్రకటించారన్నారు. దేవుని రక్షణ ప్రణాళికలో భాగంగా మరియమాతను దేవుని తల్లిగా ఎన్నుకున్నారన్నారు. మేరీమాత ఉత్సవాలకు తొమ్మిది రోజులు ముందుగా నవదిన ప్రార్థనలు జరగటం సంప్రదాయంగా వస్తోందన్నారు. నవదిన ప్రార్థనలు ముగిసిన తరువాత 101వ మేరీమాత ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
కొండపై దివ్య బలిపూజ..
అనంతరం వికార్ జనరల్ ఫాదర్ ఎం. గాబ్రియేలు, ఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ ఫాదర్ సునీల్‌రాజు, పుణ్యక్షేత్ర గురువులు, మఠకన్యలు కొవ్వొత్తులు చేపట్టి జపమాల ధ్యానంతో కొండపై ఉన్న మేరీమాత స్వరూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద సమష్టి దివ్య బలిపూజ సమర్పించి భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. ప్రొక్రెయిటర్ ఫాదర్ ఆనంద్, ఫాదర్ ఎం. చిన్నప్ప, ఫాదర్ పసల థామస్, ఫాదర్ మరియన్న, క్రైస్తవ విశ్వసులు పాల్గొన్నారు.
గుణదలలో మరియమాత
పతాకం ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment