కృష్ణా జిల్లా పరిషత్‌కు అరుదైన గౌరవం
గుడ్లవల్లేరు: ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్‌కు అరుదైన గౌరవం లభించింది. బెస్ట్ అకౌంట్స్ పెర్ఫార్మెన్స్ అవార్డు వరించింది. 2023 పంచాయతీ విభాగంలోని సబ్ కేటగిరీ కింద జెడ్పీని అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును శనివారం అందుకోనున్నట్లు జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు, జెడ్పీ సభ్యుల సహకారంతో ఈ విజయాన్ని సాధించినట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తెలిపారు.
ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని మొవ్వ మండలం కూచిపూడిలో గల శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో శుక్రవారం మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మూడో సెమిస్టర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. దరువులు– ఉప కథలు సబ్జెక్టుపై జరిగిన ప్రాక్టికల్ పరీక్షకు 17 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు పరిశీలకుడిగా భాగవతుల శ్రీనివాస శర్మ వ్యవహరించగా, చీఫ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ చింతా రవి బాలకృష్ణ, నట్టువాంగంపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏలేశ్వరపు శ్రీనివాసులు, గాత్రంపై వేదాంతం వెంకట దుర్గా భవాని, టీచింగ్ అసిస్టెంట్ పసుమర్తి హరినాథ్ శాస్త్రి సహకరించారు.
యార్డులో 70,952 మిర్చి బస్తాలు విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 61,331 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 70,952 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.7,500 నుంచి రూ.15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.7,000 నుంచి రూ.14,500 వరకు ధర లభించింది. ఏసీ కామన్ రకం రూ.8,500 నుంచి రూ.13,000 వరకు ధర పలికింది. ఏసీ ప్రత్యేక రకాలకు రూ.7,500 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 58,781 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment