ప్రైవేట్‌లో పేరుకే ప్రయోగం! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌లో పేరుకే ప్రయోగం!

Published Sat, Feb 1 2025 1:41 AM | Last Updated on Sat, Feb 1 2025 1:41 AM

ప్రైవేట్‌లో పేరుకే ప్రయోగం!

ప్రైవేట్‌లో పేరుకే ప్రయోగం!

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సైన్స్‌ విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రయోగాలు చేయాల్సిందే. వందశాతం ప్రయోగాలు చేసినప్పుడే వాటిపై విద్యార్థులకు పట్టు సాధించేందుకు అవకాశముంటుంది. అయితే జిల్లాలో ప్రైవేట్‌ యాజమాన్యాల ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలల్లో ప్రయోగాలు పేరుకే తప్పా ఆచరణలో విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు ఉండటం లేదు. ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రయోగ పరీక్షలు చేయించాలి. అయితే ఇంటర్మీడియెట్‌లో చేరిన సైన్స్‌, మ్యాథ్స్‌ విద్యార్థులతో కార్పొరేట్‌, ప్రైవేటు కాలేజీల్లో ప్రయోగాలు చేయించడం లేదు. థియరీ, జేఈఈ వంటి పోటీల పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డు నుంచి ఆయా కాలేజీలకు చెందిన యాజమాన్యాలకు ఉత్తర్వులు అందాయి. చాలా కాలేజీల్లోని ల్యాబ్‌ల్లో రసాయనాలు, స్పెసిమన్లు అలమరాలకే పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఇతర పరికరాలు బూజు పట్టి దర్శనమిస్తున్నాయని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు.

జిల్లాలో 202 జూనియర్‌ కళాశాలలు..

ఎన్టీఆర్‌ జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన కాలేజీలు 202 వరకూ ఉన్నాయి. ఇందులో సుమారు 155 కార్పొరేట్‌, ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. జూనియర్‌ ఇంటర్‌ పరీక్షలకు 39,400 మంది విద్యార్థులు హాజరవుతుండగా, సుమారు 38 వేల మంది ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. సాధారణ కోర్సుల ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి నెల 10 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం విద్యార్థుల్లో సుమారు 50 శాతానికి పైగా సైన్స్‌ విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరుకానున్నారు. ఒకేషనల్‌ విద్యార్థులకు వచ్చే నెల ఐదు నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనునున్నాయి.

ప్రభుత్వ కళాశాలలకు నిధుల కొరత..

గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రయోగాల నిర్వహణ కోసం ఏడాదికి రూ.30వేల నుంచి రూ.50వేల వరకు నిధులు విడుదల చేసేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థి చెల్లిస్తున్న ఫీజులో కొంత మొత్తాన్ని ప్రయోగాల కోసం కేటాయిస్తున్నారు. వసూలు చేసిన మొత్తం ల్యాబ్‌ల్లో పరికరాలు, రసాయనాల కొనుగోలుకు సరిపోకపోవడంతో ఆయా కళాశాలలో అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. అరకొరగా ప్రయోగాలు చేయించి సరిపెట్టేస్తున్నారు.

జంబ్లింగ్‌ విధానం రద్దుతో ఇష్టారాజ్యం..

గత ప్రభుత్వ పాలనలో ఇంటర్మీడియెట్‌ విద్యను అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం నిర్వహించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అకడమిక్‌ క్యాలెండర్‌ను పట్టించుకోవడం లేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రయోగ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించి ఎలాంటి అవతవకలకు ఆస్కారం లేకుండా చేసింది. అయితే కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలు కాసులకు తలొగ్గిన ప్రస్తుత ప్రభుత్వం నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు నిర్వహించేటట్లు చేసినట్లు విమర్శలున్నాయి. ఫిబ్రవరిలో మొదలు కానున్న ప్రయోగ పరీక్షలను ఏ కాలేజీకి చెందిన విద్యార్థులు ఆ కాలేజీలోనే రాయనున్నారు. ఆయా కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి అధికారం లేకుండా బోర్డు ఉన్నతాధికారులు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో ప్రయోగ పీరియడ్లు లేకుండా కేవలం థియరీ, జేఈఈ, నీట్‌ వంటి పోటీల పరీక్షల తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రయోగ పరీక్షలకు దగ్గర పడుతున్న సమయంలో కొన్ని కళాశాలలు తమ దగ్గర ఉన్న అరకొర వసతులతో కూడిన ల్యాబ్‌లకు హడావుడిగా విద్యార్థులను తీసుకొని వెళ్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. కళాశాలల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘ఇంటర్‌’లో ప్రహసనంలా మారిన ప్రాక్టికల్‌ పరీక్షలు

జిల్లాలో 155 రౖపైవేట్‌ జూనియర్‌

కళాశాలలు

చాలా కళాశాలల్లో

ప్రయోగశాలలే లేవు

కొన్నింటిలో కాగితాలకే

పరిమితమైన ప్రాక్టికల్స్‌

థియరీ, పోటీ పరీక్షలకు మాత్రమే

తరగతులు

బూజుపట్టిన ల్యాబ్‌లు, పరికరాలు

ఫిబ్రవరి 10 నుంచి ఇంటర్‌

ప్రాక్టికల్‌ పరీక్షలు

ప్రయోగశాల వసతులుంటేనే అనుమతులు..

ప్రయోగశాలలు వంటి వసతులు ఉన్న కళాశాలలకే అనుమతులుంటాయి. అందులోనూ గత ఏడాది వరకూ జంబ్లింగ్‌ పద్ధతిలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది నుంచి ఆయా కళాశాల్లోనే ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి కచ్చితంగా ప్రయోగాలకు సంబంధించి విద్యార్థులకు వాటి తరగతులకు హాజరు కావాల్సిందే. అలా కాని కళాశాలుంటే, మా దృష్టికి వస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. ఫిబ్రవరి పది నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి.

– సీఎస్‌ఎస్‌ఎన్‌ రెడ్డి,

ఆర్‌ఐవో, ఎన్టీఆర్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement