కలెక్టరేట్‌లో ప్లాస్టిక్ వాడకం నిషేధం
చిలకలపూడి(మచిలీపట్నం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలెక్టరేట్‌లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ప్రకటించారు. శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్లాస్టిక్ వాడకం నియంత్రణపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా పర్యావరణాన్ని మెరుగుపరిచే కార్యాచరణలో ఒక్కొక్క నెల ఒక్కొక్క ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకాన్ని నివారించడానికి నిర్ణయించామన్నారు. జిల్లా అధికారులతో పాటు సిబ్బందికి స్టీల్ బాటిల్స్‌ను ఆయన అందజేశారు. ఇకపై జిల్లా అధికారులు కలెక్టరేట్‌లో సమావేశాల నిర్వహణలో ప్లాస్టిక్ సీసాలను పంపిణీ చేయకూడదని అధికారులకు ఇచ్చిన స్టీల్ సీసాలో నీరు తెచ్చుకోవాలన్నారు. మచిలీపట్నంలో రోజుకు 80 టన్నుల చెత్త తయారవుతోందని, అందులో 36 శాతం ప్లాస్టిక్ సంబంధిత వస్తువులే ఉంటున్నాయన్నారు. ప్లాస్టిక్ సీసాల వాడకం చిత్తశుద్ధితో ఆపే ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంద్ర ప్రతిజ్ఞను అధికారులు, సిబ్బందితో ఆయన చేయించారు. కలెక్టరేట్ నుంచి అధికారులు, సిబ్బందితో కలిసి ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద ఉన్న కూడలి వరకు ర్యాలీ చేశారు. అక్కడ మానవహారంగా ఏర్పడి మరోసారి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జెడ్పీ డెప్యూటీ సీసీవో ఆనందకుమార్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు శివప్రసాద్, హరిహరనాఽథ్, బందరు ఆర్డీవో స్వాతి, డీపీవో అరుణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment