‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
చిలకలపూడి(మచిలీపట్నం): పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు జిల్లాలో 22,341 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 145 పరీక్ష కేంద్రాలను విద్యాశాఖాధికారులు సిద్ధం చేశారు. విద్యార్థులకు అందించే ప్రశ్న, సమాధాన పత్రాలు ఈ నెల 14వ తేదీ నాటికే జిల్లాకు చేరగా.. వాటిని 23 స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. పరీక్ష ప్రారంభించిన రోజు ఆయా స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.
ఆ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలో ఏర్పాటు చేసిన 145 కేంద్రాల్లో 52 కేంద్రాలను సీ–కేటగిరీ కేంద్రాలుగా గుర్తించి ఆ కేంద్రాల్లో 52 సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆరు సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించారు. వీటిలో గన్నవరం మండలం ముస్తాబాద జెడ్పీహెచ్‌ఎస్, కంకిపాడు మండలం పునాదిపాడు జెడ్పీహెచ్‌ఎస్, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి జెడ్పీహెచ్‌ఎస్, బందరు మండలం తాళ్లపాలెం జెడ్పీహెచ్‌ఎస్, గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గవర్నమెంట్ హైస్కూల్, అవనిగడ్డ మండలం అవనిగడ్డ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఏర్పాట్లు చేశారు. వీటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దానికి సంబంధించి డీఈవో కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు.
కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్..
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆదివారం కలెక్టర్ విద్యాశాఖాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు చేయాలన్నారు. మహిళా విద్యార్థినులకు తనిఖీ చేసేందుకు కొన్ని చోట్ల మహిళా పోలీసుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను అనుమతించకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. కేంద్రాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థులకు నిబంధనలు కచ్చితంగా తెలియజేయాలన్నారు.
కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన
ఏర్పాట్లు పరిశీలించిన
విద్యాశాఖాధికారులు
టెలి కాన్ఫరెన్స్‌లో అధికారులకు కలెక్టర్ బాలాజీ దిశానిర్దేశం
Comments
Please login to add a commentAdd a comment