
నేడు అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభం
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన అశోక్ లేల్యాండ్ బస్ బాడీ బిల్డింగ్ తయారీ పరిశ్రమను మంత్రి నారా లోకేష్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బస్ బాడీ బిల్డింగ్ తయారీ యూని ట్‌లో పెండింగ్ పనులను పూర్తి చేయటంతో పాటు ఇటీవలే ట్రయన్ రన్ నిర్వహించారు. ఈ యూనిట్‌లో అత్యాధునిక సాంకేతికతతో ఈవీ, బీఎస్–6 నాణ్యాతా ప్రమాణాలతో బస్సులను తయారు చేయనున్నారు. ఈ ప్లాంట్ ఏటా 4800 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనుంది. మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. అశోక్ లేల్యాండ్ మల్లవల్లి ప్లాంట్ హెడ్ శ్రీధరన్‌ను కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్‌కు వివరించారు. గుడివాడ ఆర్డీఓ బాల సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, బాపులపాడు తహసీల్దార్ బండ్రెడ్డి మురళీకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment