
లబ్ధిదారులకు విరివిగా రుణాలు ఇవ్వండి
బ్యాంకర్లకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ సూచన
చిలకలపూడి(మచిలీపట్నం): రైతులకు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగళవారం వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. పంట సాగు చేస్తూ సీసీఆర్‌సీ కార్డులు ఉన్న కౌలు రైతులకు పంట రుణాలు తప్పనిసరిగా అందించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకంగా ప్రత్యేకించి బ్యాంకు రుణాలు అందించాలని, అవసరమైతే రుణ పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఎస్‌ఎంఈ కింద ఏపీఐఐసీ ద్వారా స్థలం కేటాయింపులు జరిపిన పారిశ్రామికవేత్తలకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. రవాణా రంగానికి సంబంధించి బ్యాంకు అధికారులు రుణాలు తక్కువగా ఇస్తున్నారని, దానికి ప్రాధాన్యం ఇచ్చి ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని కోరారు. బ్యాంక్ కంట్రోలింగ్ అధికారులు పరిశ్రమల అధికారులతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రుణాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఏడు వేల మంది మహిళా వ్యాపారవేత్తలను తయారుచేసి, అవసరమైన జీవనోపాధి కల్పించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించిందన్నారు. ఇందు కోసం బ్యాంకులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు విరివిగా రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా లక్ష రూపాయల వరకు బ్యాంకు రుణాలను ఎటువంటి బిల్లులు లేకుండా మంజూరు చేసి చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని కోరారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాల నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులకు భరోసా ఇచ్చేలా చూడాలన్నారు. బ్యాంకు లావాదేవీలపై ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఏజీఎం అభిషేక్, ఎల్‌డీఎం రవీంద్రారెడ్డి, ఇండియన్ బ్యాంక్ డీఎం రామారావు, ఎస్‌బీఐ ఆర్‌ఎం సుబ్రహ్మణ్యం, యూనియన్ బ్యాంక్ ఆర్‌ఎం తాతాజీ, జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకట్రావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, టిడ్కో పీడీ చిన్నోడు తదితరులు పాల్గొన్నారు.