ద్విచక్ర వాహనం ఢీకొని గొర్రెలకాపరి మృతి
ఘంటసాల: ద్విచక్ర వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన గొర్రెల కాపరి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఘంటసాల రజకపేటకు చెందిన కొడాలి దేవచంద్రరావు (29) గొర్రెల కాపరిగా జీవిస్తున్నాడు. బుధవారం యథావిధిగా గొర్రెలను మేపడానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా మల్లాయి చిట్టూరు రోడ్డులో అతడిని ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవచంద్రరావు తల వెనుక భాగంలో తీవ్రగాయమైంది. ఈ సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చల్లపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు. విజయవాడ తీసుకెళ్తుండగా దారిలోనే మృతి చెందాడు. దేవచంద్రరావుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తమను ఎవరు పోషిస్తారంటూ మృతుడి భార్య భవానీ విలపిస్తున్న తీరు పలువురిని కలిచివే సింది. భవాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment