బందరులో దారుణ హత్య
కోనేరుసెంటర్: వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితుడే అతన్ని అంతమొందించాడు. ఈ ఘటన మచిలీపట్నంలోని వర్రేగూడెంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్రేగూడెంకు చెందిన వీర్నాల శ్రీను అలియాస్ టోపీ శ్రీను(45) వ్యాను నడుపుతుంటాడు. అదే ప్రాంతానికి చెందిన, గతంలో హోంగార్డుగా పనిచేసిన సుంకర రమణ, శ్రీను స్నేహితులు. సుంకర రమణ ప్రేమ వివాహం చేసుకోగా.. ఈతని భార్యతో శ్రీను సన్నిహితంగా మెలిగేవాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కొంత కాలంగా రమణ భార్యను శ్రీను వేరే ఇంట్లో పెట్టి వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. అవమానం తట్టుకోలేని రమణ కొంతకాలం క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడే ఉంటూ వేరే పనులు చేసుకుంటున్నాడు.
మూడు రోజుల క్రితమే వచ్చి..
హైదరాబాద్‌లో ఉంటున్న రమణ మూడు రోజుల క్రితం మచిలీపట్నం వచ్చాడు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో రమణ, శ్రీనుల మధ్య మరలా ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రమణ అతని స్నేహితులతో కలిసి శ్రీనును క్రికెట్ బ్యాట్‌తో తలపై బలంగా కొట్టి చంపాడు. విషయం తెలుసుకున్న ఇనగుదురుపేట పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని మచిలీ పట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ పరమేశ్వరరావు తెలిపారు. హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. ఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. హత్యకు పాల్పడిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.
స్నేహితుడిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన వైనం వివాహేతర సంబంధమే కారణం కేసు నమోదు చేసిన పోలీసులు
బందరులో దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment