ఉపాధిలో అవినీతి మేట్‌లు
జి.కొండూరు: కూటమి అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది. దోచుకునేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు తయారైంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ నాయకులు నియమించుకున్న ఆ పార్టీ సానుభూతిపరులు చేస్తున్న అక్రమాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి చండ్రగూడెం గ్రామ పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యాన పంటలకు ఇచ్చే కూలీల వేతనాల్లో అక్రమాలకు పాల్పడిన 24 మంది మేట్‌లపై సోమవారం వేటుపడింది. ఫీల్డ్ అసిస్టెంటును తొలగించాలని ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ 24 మంది మేట్‌లు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన వారే కావడం గమనార్హం. వారంతా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌తో కుమ్మకై ్క రైతులకు అందాల్సిన వేతన నగదు రూ.25 లక్షల వరకు స్వాహా చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్వాహా పర్వంపై అధికారులు విచారణ చేపట్టారు.
అక్రమం జరిగింది ఇలా...
చండ్రగూడెం గ్రామ పంచాయతీలో రైతులు కొన్నేళ్లుగా మల్లెతోటలు సాగు చేస్తున్నారు. ఇక్కడి మల్లెలు విజయవాడ, హైదరాబాద్ వరకు ఎగుమతి అవుతాయి. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మల్లెతోటల పెంపకానికి ఆర్థిక సాయం అందిస్తున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన 43 మంది రైతులు మల్లెసాగుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ 43 మంది రైతులు 19.40 ఎకరాల్లో 31,040 మల్లె మొక్కలు నాటారు. ఈ మొక్కలు నాటడానికి అవసరమైన కూలీలతో గుంతలు తవ్విస్తారు. ఒక్కొక్క గుంతకు రూ.35 చొప్పున ఉపాధి పథకం కింద వేతనం ఇస్తారు. ఇది కాక రైతులకు ఏడాదికి తోటల నిర్వహణ కింద వంద రోజుల పని దినాలను సైతం కల్పిస్తారు. గుంతలు తవ్వేందుకు రైతులు ఉపాధి కూలీలను వినియోగించుకుంటారు. ఈ క్రమంలో జాబ్‌కార్డు ఉండి తమకు అనుకూలంగా ఉన్న గ్రామస్తులను మేట్‌లు ఎంచు కొని వారి పేర్లను పని చేయకుండానే గుంతలు తవ్విన వారి జాబితాలో చేర్చారు. ఆ తరువాత వారి పేరిట వచ్చిన వేతన నగదును వాటాలు వేసుకొని పంచుకున్నారు. ఈ క్రమంలో వేతన నగదు రాని గ్రామానికి చెందిన రైతులు కొందరు ఉపాధి హామీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో మేట్‌ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. రైతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన అధికారులు ముగ్గురు రైతులకు చెందిన రూ.22 వేలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఇదే కాకుండా గ్రామంలో రైతులు అందరినీ విచారణ జరిపిన తర్వాత పక్కదారి పట్టిన నగదును మేటల్ నుంచి రికవరీ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ముందుగా గ్రామానికి చెందిన 24 మంది మేట్‌లు, ఒక ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించారు.
రూ.25 లక్షల స్వాహా చేశారని అంచనా
పక్కదారి పట్టిన నగదు రూ.లక్ష వరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే అంత తక్కువ నగదు పక్కదారి పట్టినప్పుడు 24 మంది మేట్‌లను, ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మల్లె తోటలే కాకుండా గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద సాగవుతున్న ప్రతి ఉద్యాన పంటల కూలీల వేతనాల్లో అక్రమాలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో అప్పటికే సాగులో ఉన్న ఉద్యాన పంటలకు కూడా ఆర్థిక సాయం ఇప్పిస్తామంటూ మేట్‌లు రైతులతో దరఖాస్తులు చేయించి, ఆయా పంటల సాగుకు వేతనాల రూపంలో వచ్చే నగదును కూడా నొక్కేశారని ఆరోపణలు వస్తు న్నాయి. ఇవే కాకుండా గ్రామంలో జరిగిన ఉపాధి పనుల్లో సైతం పనిలోకి రాని కూలీల పేర్లు కూడా నమోదు చేసి ఆ నగదును నొక్కేశారని తెలుస్తోంది. మొత్తంగా గ్రామ పంచాయతీ నుంచి రూ.25 లక్షల వరకు మేట్‌లు దోచారని సమాచారం. ఈ నగదును వాటాలు పంచుకునే విషయమై మేట్‌ల మధ్య తేడాలు రావడంతో అక్రమ దందా బయటకు పొక్కిందని సమాచారం.
రైతులకు అందాల్సిన వేతన నగదును దోచిన మేట్‌లు చండ్రగూడెంలో రూ.25 లక్షల వరకు స్వాహా చేసిన వైనం వేతనాల అక్రమాలపై విచారణ జరుపుతున్న అధికారులు 24 మంది మేట్‌లు విధుల నుంచి తొలగింపు ఈ మేట్‌లు అందరూ టీడీపీ సానుభూతిపరులే..
మేట్‌లను తొలగించాం
చండ్రగూడెం గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన మల్లె తోటల్లో గుంతల తవ్వకంలో అవకతవకలపై 24 మంది మేట్‌లను తొలగించాం. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపునకు ప్రాజెక్టు డైరెక్టర్‌కు నివేదిక ఇచ్చాం. ముగ్గురు రైతులకు చెందిన రూ.22 వేలు పక్కదారి పట్టినట్లు తేలింది. గ్రామంలో రైతులు అందరినీ విచారించి పక్కదారి పట్టిన నగదును మేట్‌ల నుంచి రికవరీ చేస్తాం.
– వెంకటేశ్వరరావు, ఏపీఓ, మైలవరం
ఉపాధిలో అవినీతి మేట్‌లు
Comments
Please login to add a commentAdd a comment