అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమ వారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్, జేసీ గీతాంజలి శర్మ, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పద్మా దేవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 183 అర్జీలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అధికారులు తమ కార్యాలయ సిబ్బంది అందరితో ఉద్యోగుల ఆరోగ్య పథకంలో పేరు నమోదు చేయించి కార్డు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులు ఎవరైనా పీజీఆర్‌ఎస్‌కు రాలేకపోతే ముందుగా తన అనుమతి పొందాలని స్పష్టంచేశారు. పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాని, అర్జీదారుల ప్రవర్తనను పరిశీలించేందుకు వచ్చే సోమవారం నాటికి సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్ ఏర్పాటు చేయాలని డీఆర్వోను ఆదేశించారు. లేకుంటే తాను ఆ కార్యక్రమానికి హాజరుకానని స్పష్టంచేశారు. అనంతరం కలెక్టర్ బాలాజీ వీడియోకాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సంబంధించి వివిధ ప్రభుత్వశాఖల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ బాలాజీ వివిధ సమస్యలపై 183 అర్జీలు
ముఖ్యమైన అర్జీలు ఇలా..
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఏబీసీ గ్రూపులుగా చేస్తూ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలతో మాదిగలకు సమన్యాయం జరగలేదని, ఎస్సీ గణాంకాలపై కులాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం కమిషన్ నివేదికను మరొక్కసారి పరిశీలించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు కంచర్ల సుధాకర్, జె.ప్రశాంతి, సైమన్‌బాబు అర్జీ ఇచ్చారు.
గూడూరు మండలం తుమ్మలపాలెం పంచాయతీలో కొత్త తుమ్మలపాలెం ఎస్సీ కాలనీలో 120 కుటుంబాల వారు నివసిస్తున్నారని, నీటి సమస్య ఎక్కువగా ఉందని తరకటూరు చెరువు నుంచి తమ గ్రామానికి ఎస్సీ కాలనీ మీదుగా పైప్‌లైన్ వేసేలా చర్యలు తీసుకోవాలని గూడూరుకు చెందిన జడ దావీదురాజు అర్జీ ఇచ్చారు.
బాపులపాడు మండలం పెరికీడు వంతెన గ్రామంలోని విజయ డ్వాక్రా గ్రూపులుగా తాము సభ్యులుగా ఉన్నామని, గ్రూపు సెక్రటరీ తిరుమలశెట్టి నాగరమ్య, పద్మకు ప్రతి నెలా గ్రూపు సభ్యులు రుణం బ్యాంకులో చెల్లించేందుకు ఇస్తున్న డబ్బులను జమ చేయడం లేదని, రూ.7 లక్షల వరకు తమను మోసం చేశారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని విశాఖ రమాదేవి, పి.లక్ష్మి తదితరులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment