ఆపద వేళ స్వీయరక్షణ అవసరం
అవగాహన సదస్సులో అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు
కోనేరుసెంటర్: మహిళల రక్షణకు అనేక చట్టాలు అమలులో ఉన్నాయని, వాటన్నింటిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లోని స్పందన హాలులో ‘మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు– నియంత్రణ’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న అడిషనల్ ఎస్పీ నాయుడు మాట్లాడుతూ మహిళలు ఆపదలో ఉన్నపుడు పోలీసులను గుర్తు తెచ్చుకోవటం ఎంత అవసరమో.. తనను తాను రక్షించుకునే మార్గాలను అన్వేషించటం కూడా అంతే అవసరమన్నారు. అవసరమైతే ఆ సమయంలో ఆడవాళ్లు ఆదిపరాశక్తిగా మారి తనను తాను ఒక ఆయుధంలా మార్చుకునేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే సామాజిక మాధ్యమాలు అనేవి సమాచార సేకరణకు, భావవ్యక్తీకరణకు ఉపయోగించుకోవాలన్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే సమయంలో గోప్యతను పాటించాలన్నారు. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనపుడు హెల్ప్ లైన్ నంబర్లు 181, 121, 1098లకు ఫోన్ చేసి పోలీసుల నుంచి తక్షణ రక్షణను పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పోలీసు సేవలను పొందాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. అనంతరం పలువురు అధికారులు చట్టాలు, రక్షణ, పోలీసు చర్యలు, స్వీయరక్షణ తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ వాస వెంకటేశ్వరరావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కె.సువార, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. రాణి, సీడీపీవో మౌనిష, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అర్చిష్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment