కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం
జగ్గయ్యపేట: ధర లేదని కోల్డ్ స్టోరీజ్‌లో నిల్వ చేసుకున్న తమ కష్టమంతా అగ్నికి ఆహుతైందని మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. జగ్గయ్యపేటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మిర్చి కాలి బూడిదైంది. పట్టణంలోని తొర్రకుంటపాలెం తిరుమలగిరి రోడ్డులోని సాయి తిరుమల అగ్రి ప్రొడక్ట్ లిమిటెడ్ (కోల్డ్ స్టోరేజ్)లో ఏడాదిగా సుమారు 350 మంది రైతులు 35 వేల మిర్చి బస్తాలను నిల్వ చేశారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో స్టోరేజ్ ప్రాంతంలో పొగతో కూడిన మిర్చి ఘాటు రావడంతో స్థానికులు ఫైర్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, సిమెంట్ కర్మాగారాల నుంచి వచ్చిన ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కోల్డ్ స్టోరేజ్ గోడలను జేసీబీలతో పగలగొట్టి మంటలను అదుపు చేయడానికి యత్నించారు.
రూ.5 కోట్ల నష్టం
జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరావు, ఏపీ ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని కర్మాగారం నుంచి సీవో2ను తీసుకువచ్చి ప్రత్యేక పైప్‌లైన్‌తో ఏర్పాటు చేయడంతో మంటలు కొంత మేర అదుపులోకి వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రమాదంలో రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నందిగామ ఆర్డీవో బాలకృష్ణ మాట్లాడుతూ నిల్వ చేసిన రైతుల పేర్లను అందిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం సాయంత్రం వరకు దట్టమైన పొగ, మిర్చి ఘాటుతో సమీప గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కారణంతో సమీపంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.
35 వేల మిర్చి బస్తాలు బుగ్గి
జగ్గయ్యపేట తొర్రకుంటపాలెంలో ఘటన
కోల్డ్ స్టోరేజ్‌లో అగ్ని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment