బంగారం చోరీ కేసులో నిందితుల అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో బంగారు ఆభరణాల బ్యాగు చోరీ కేసులో జీఆర్పీ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.15.62 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ జి.వి రమణ, ఆర్పీఎఫ్ సీఐ ఫలే ఆలీబేగ్ వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని రాజాంపేటకు చెందిన గుడిమెట్ల భానుప్రియ ఈ నెల 13న కుటుంబసభ్యులతో సామర్లకోటకు గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు. ఆమె బ్యాగులో ల్యాప్‌టాప్, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను ఉంచి దాన్ని తలకింద పెట్టుకుని నిద్రపోయింది. విజయవాడ దాటిన తర్వాత చూసుకుంటే బ్యాగు కనిపించలేదు. టీటీఈలకు ఫిర్యాదు చేసి ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. తిరిగి ఈ నెల 16న విజయవాడ జీఆర్పీ స్టేషన్‌కు చేరుకుని తన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేసింది. 95 గ్రాముల చైను, 44 గ్రాముల నెక్లెస్, 18 గ్రాముల నెక్లెస్, 18 గ్రాముల రెండు జతల చెవి రింగులు, 42 గ్రాముల నల్లపూసల గొలుసు, 24 గ్రాముల వెండి భరణితో పాటు ల్యాప్‌టాప్, ఒక సెల్‌ఫోన్ బ్యాగులో ఉన్నట్లు వాటి విలువ సుమారు రూ. 15.65 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రెండు ప్రత్యేక బృందాలుగా..
కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిలో ఖమ్మంజిల్లా బోనకల్లు మండలానికి చెందిన పుచ్చకాయల నరేష్ (25), షేక్ హైమద్(25)ను గుర్తించారు. నిందితులు హైదరాబాద్‌లోని కేజీహెచ్‌బీ కాలనీలోని రాఘవేంద్ర మెన్స్ హాస్టల్‌లో ఉన్నట్లు తెలుసుకుని వారిని పట్టుకున్నారు. వారిని విచారణ చేయగా చోరి చేసినట్లు అంగీకరించారు. వారి వద్ద కొంత బంగారం, ల్యాప్‌ట్యాప్ లభ్యమవ్వగా, కొంత బంగారాన్ని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టినట్లు తెలపడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్ మినహా మొత్తం రికవరీ చేశారు. వీరిపై గతంలో కేసులున్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
రూ.15.62 లక్షల ఆభరణాలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment