
ఆర్‌పీఎఫ్ మహిళా బ్యారక్ ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడలో ఆర్‌పీఎఫ్ మహిళా బ్యారక్ ప్రారంభమైంది. ఆర్‌పీఎఫ్ మహిళా సిబ్బంది సంక్షేమం, సాధికారత దిశగా విజయవాడ డివిజన్‌లో రూ.1.5 కోట్లుతో 30 పడకల మహిళా బ్యారక్‌ను రైల్వే కోర్టు సమీపంలో నిర్మించారు. దక్షిణ మధ్య రైల్వే ఇన్‌స్పెక్టర్ జనరల్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఆరోమా సింగ్ ఠాకూర్ ఈ బ్యారక్‌ను బుధవారం రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్‌పీఎఫ్ ఎస్కార్ట్, ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ), రైల్వే విధులకు హాజరయ్యే మహిళా పోలీసులు విశ్రాంతి తీసుకునేందుకు బ్యారక్‌లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్‌పై వర్కుషాపు
విజయవాడ డివిజన్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో రైల్వే ఆడిటోరియంలో ఏపీఆర్‌పీఎఫ్, ప్రభుత్వ రైల్వే పోలీసులకు ‘యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ ’ పై శిక్షణ ఇచ్చారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల్‌కు కీలకమైన జ్ఞానం, నైపుణ్యాలు అందించడమే శిక్షణ తరగతుల లక్ష్యమని ఆరోమా సింగ్ ఠాకూర్ తెలిపారు. అనంతరం విధుల్లో అనుసరించాల్సిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీఎస్‌సీ వల్లేశ్వర బి.టి, సీనియర్ డీఈఎన్ ఎస్.వరుణ్‌బాబు, సీనియర్ డీఓఎం డి.నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు.