
రైలులో గంజాయి తరలిస్తున్న నిందితుడి అరెస్ట్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న నిందితుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీఆర్పీ సిబ్బంది గురువారం విజయవాడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 1వ నంబర్ ప్లాట్‌ఫాం దక్షిణం వైపు చివరలో ఒక యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగును సోదా చేయగా అందులో ఏడు కేజీల గంజాయి లభ్యమైంది. నిందితుడిని అంబాపురానికి చెందిన సందునపల్లి రాంబాబుగా గుర్తించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి వాటిని చిన్న పొట్లాలుగా కట్టి నగరంలో అధిక ధరకు విక్రయిస్తుంటాడు. ఒడిశాలోని గంజాం జిల్లాలో చందు అనే వ్యక్తి నుంచి రాంబాబు గంజాయి కొనుగోలు చేసి రైలులో విజయవాడ చేరుకోగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పెట్రోల్ బంక్ సీజ్
నందిగామరూరల్: మండలంలోని అడవిరావులపాడు గ్రామ సమీపంలోని నయారా పెట్రోల్, డీజిల్ బంకును తూనికలు, కొలతల శాఖాధికారులు సీజ్ చేశారు. పెట్రోల్, డీజిల్ రీడింగ్‌లు, కొలతల్లో తేడాలున్నాయని వినియోగదారులు గురువారం బంకు వద్ద ఆందోళన చేశారు. మూడు నెలల నుంచి కొలతల్లో తేడాలను గమనిస్తున్నామని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ జిల్లా అధి కారి భానుప్రసాద్ మాట్లాడుతూ డీజిల్ మోటార్ పంపు ఆన్ చేయగా డీజిల్ రీడింగ్ హెచ్చుతగ్గులు చూపిస్తోందన్నారు. దీంతో క్షుణ్ణంగా తనిఖీ చేయగా మోటర్ జంప్ టెక్నిక్‌ను గుర్తించామన్నారు. దీంతో బంక్ సీజ్ చేశామని చెప్పారు. పీడీఎస్ డీటీ రామ్మూర్తి రెడ్డి పాల్గొన్నారు.
రైలు ఢీ కొని గుర్తు తెలియని యువకుడి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ – ఏలూరు మధ్య మూడో లైన్‌లో గుర్తు తెలియని యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారు వివరాలు సేకరించారు. మృతుడి వయసు 30 సంవత్సరాలు ఉంటాయని, సిమెంట్ రంగు టీ షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, కుడి చేతిపై ‘అమ్మ’ అనే పచ్చ బొట్టు ఉందని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ఒంటిపై అనేక చోట్ల గాయాలు ఉండటంతో ట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీ కొనడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్ లేదా 88971 56153, 94406 27544 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

రైలులో గంజాయి తరలిస్తున్న నిందితుడి అరెస్ట్