టీడీపీలో అరాచక నేతలు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో అరాచక నేతలు

Published Sun, Jun 4 2023 11:24 AM | Last Updated on Sun, Jun 4 2023 11:21 AM

- - Sakshi

‘‘నాపై హత్యకు సుపారీ ఇచ్చింది. ఇప్పుడు దాడి చేసింది. ఇన్ని రోజులు పిల్లోళ్లు ఎత్తుకుని పెంచాం ఎందుకులే అనుకున్నా. ఇంత వరకూ వచ్చిన తర్వాత ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.’’
ఏవీ సుబ్బారెడ్డి

యువగళం పాదయాత్రలో మే 16న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల, తన అనుచరవర్గం భౌతికదాడి చేశారు. అఖిల దగ్గరుండి కొట్టండి.. తన్నండి అని రెచ్చగొడుతూ దాడికి పురిగొల్పారు. దాడిలో ఏవీకి రక్తగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి అఖిలపై కేసు నమోదైంది. రిమాండ్‌కు వెళ్లొచ్చారు. ఈ ఘటన నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ టీడీపీలో కలకలం రేపింది.

‘‘కొడకల్లారా దాక్కోండి. గుళ్లోకెళ్లి మొక్కోండి. మీ ఖర్మకాలి టీడీపీ అధికారంలోకి వస్తే ఏ మూలన దాక్కున్నా వెంటపడి వస్తాం. వెతుక్కుంటూ వస్తాం. శోభానాగిరెడ్డి రాజకీయం చూపిద్దామనుకున్నా. వీళ్లకి భూమా నాగిరెడ్డి రాజకీయమే కావాల. కచ్చితంగా నాగిరెడ్డి రాజకీయమే చూపిస్తా!’’ – ఆళ్లగడ్డ యువగళం సభలో భూమా జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి

సాక్షి ప్రతినిధి కర్నూలు: వ్యక్తిగతమైన ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలు తమ వర్గాలకు రుద్ది, ఇది వ్యక్తిగతంగా తమ మధ్య ఉన్న విభేదాలుగా కాకుండా, వర్గాల మధ్య విభేదాలుగా చూపి రాజకీయం చేయడం టీడీపీ నేతలకే చెల్లింది. పొరపాటున టీడీపీకి అధికారం ఇస్తే ‘ఫ్యాక్షన్‌’ రాజకీయాలు చేస్తామని భూమా నాగిరెడ్డి వారసుడు విఖ్యాత్‌రెడ్డి.. లోకేశ్‌ సమక్షంలోనే తెగేసి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కనీసం ఇలాంటివి తప్పని కూడా వారించే ప్రయత్నం లోకేశ్‌ చేయకపోవడం ఆయన రాజకీయ పరిణతి ఏపాటిదో తెలియజేస్తోంది.

దీంతో నిజంగానే వీరికి అధికారం ఇస్తే మళ్లీ ఫ్యాక్షన్‌ తగాదాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలో రక్తం పారే ప్రమాదం లేకపోలేదని ప్రజల్లో భయాందోళన నెలకొంది. వైఎస్సార్‌సీపీ కండువాతో గెలిచిన అఖిల, నాగిరెడ్డి ‘పచ్చ’కండువాలేసుకుని ‘సైకిల్‌’ జర్నీ చేశారు. 2019 ఎన్నికలకు ముందే నాగిరెడ్డి చనిపోయారు. ఈ ఎన్నికల్లో అఖిల ఓడిపోయారు. ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యేలుగా కొత్తతరం రాజకీయనేతలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఎన్నికయ్యారు. నాలుగేళ్లలో అభివృద్ధి మినహా వీరికి మరో ఆలోచన లేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా రెండు నియోజకవర్గాల్లో మళ్లీ అరాచక పాలన మొదలవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

అఖిల వ్యవహారంతో కుటుంబ సభ్యులు దూరం
నాగిరెడ్డి మృతి తర్వాత విభేదాల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి దూరమయ్యాడు. చివరకు తనను చంపించేందుకు అఖిల సుఫారీ ఇచ్చినట్లు ఏవీ ఆరోపించారు. చింతకుంట, గోవిందపల్లికి చెందిన కొంతమందిని కడప పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. ఏవీని దూరం చేసుకోవడం అఖిలకు దెబ్బే! ‘భూమా’కు అత్యంత సన్నిహితుడైన శివరామిరెడ్డిని క్రషర్‌ విషయంలో దూరం చేసుకున్నారు. నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డిని ఆ కుర్చీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో ఆయన కూడా దూరమయ్యారు.

ఆపై అఖిల పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో విభేదాలు పెంచుకున్నారు. దీంతో అతను బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సోదరుడు మహేశ్‌ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషోర్‌ పార్టీలో చేరిన తర్వాత తన ఇంటికి వెళ్లకుండా కిషోర్‌ నివాసానికి అఖిల తాళాలు వేయించారు. చివరకు బ్రహ్మానందరెడ్డికి, అఖిలకు కూడా మాటల్లేవు. ఇలా ఒక్కొక్కరుగా ‘భూమా’ బంధువులు పూర్తిగా అఖిలకు దూరమయ్యారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలోని ‘భూమా’ వర్గం కూడా రాజకీయంగా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు.

దీంతో ఆళ్లగడ్డకు అఖిల వచ్చినా కనీసం పదిమంది ఇంటికి రాని పరిస్థితి. ఈ కారణంగానే ఆమె జిల్లాకు రావడం వదిలేసి ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటోందనే చర్చ ఉంది. అయితే అక్కడ కూడా వివాదాల్లో తలదూర్చారు. శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు కేసీఆర్‌ బంధువులను కిడ్నాప్‌ చేసిన వ్యవహారంలో అఖిల 14రోజుల రిమాండ్‌లో ఉన్నారు. చంచల్‌గూడకు ‘సీమ’లో బహుశా, రాష్ట్ర రాజకీయాల్లో కిడ్నాప్‌ వ్యవహారంలో మాజీ మహిళా మంత్రి జైలుకు వెళ్లడం ఇదే ప్రథమం.

‘ఫ్యాక్షన్‌’ భూమిలో అభివృద్ధి వెలుగులు
ఆళ్లగడ్డ మూడు దశాబ్దాలపాటు ‘భూమా’ ఏలుబడిలోనే ఉంది. ఇన్నేళ్లలో సాధించిందేమిటని ఆరాతీస్తే హత్యలు, కేసులు, వారిని నమ్మకున్న కుటుంబాలు ఫ్యాక్షన్‌లో రాలిపోవడం మాత్రమే. నాగిరెడ్డి వల్ల నాపై 24కేసులు ఉన్నాయని, ఫ్యాక్షన్‌ నడిపానని ఏవీ సుబ్బారెడ్డే స్వయంగా చెబుతున్నారు. ఇదేదో వారు సాధించిన ఘనకార్యంలా చెప్పుకుంటున్నారు. గంగుల బిజేంద్రారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ కాలేజీ సాధించి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. 30 పడకల ఆస్పత్రి 50 పడకలకు పెంచి పేదల ఆరోగ్యానికి దన్నుగా నిలిచారు.

చాగలమర్రి మండలం వనిపెంట చెంచుగూడెం లాంటి చీకటి తండాలకు వంతెనలను నిర్మించి బయటి ప్రపంచానికి వారిని తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఆలోచనలో అభివృద్ధి మినహా మరో ఆలోచన లేని నాయకుడిగా ఎదుగుతున్నారు. అలాగే శిల్పా రవి హయాంలో నంద్యాల జిల్లా కేంద్రమైంది. మెడికల్‌ కాలేజి సాధించారు. ‘అమృత్‌’ ద్వారా రూ.9కోట్లతో వెలుగోడు నుంచి తాగునీటిని నంద్యాలకు రప్పించి దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారు. నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మూడు వంతెనలు నిర్మించారు. ఇలా వీరు అభివృద్ధి వైపు వెళుతున్నారు. కానీ టీడీపీ నేతలు గెలిస్తే చంపుతాం, నరుకుతాం అంటూ రక్తచరిత్రను గుర్తు చేస్తూ ప్రశాంత గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement