కర్నూలు: లోకాయుక్త కోర్టులో గార్డు విధుల్లో ఉన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రేగడ్డ సత్యనారాయణ (52) ప్రమాదవశాత్తూ తుపాకీ (ఎస్‌ఎల్‌ఆర్) పేలి మృతిచెందాడు. ఈయన అశోక్‌నగర్‌లోని నాగార్జున అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. శుక్రవారం ఉదయం విధులకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి లోకాయుక్త కార్యాలయానికి వెళ్లాడు. గార్డు విధుల్లో ఉంటూ బాత్‌రూమ్‌కి వెళ్లి బయటకు వస్తుండగా చేతిలో ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న సత్యనారాయణను సహోద్యోగులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
1992లో ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగం(ఏఆర్)లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఈయన ఎక్కువకాలం ఎంటీఓ సెక్షన్‌లో పనిచేశారు. ఇటీవలనే జనరల్ డ్యూటీలకు నియమించుకుని లోకాయుక్త కోర్టులో గార్డు డ్యూటీ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఈయనకు భార్య అనురాధతో పాటు పద్మనందిని, మౌనిక కూతుర్లు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు డీఎస్పీ విజయశేఖర్, నాలుగో పట్టణ ఎస్‌ఐ పెద్దయ్య నాయుడు, ఆర్‌ఐలు రమణ, పోతురాజుతో పాటు పలువురు అధికారులు, సహోద్యోగులు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి వచ్చి మృతదేహాన్ని సందర్శించారు.
కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి తన భర్త మృతిచెందినట్లు సత్యనారాయణ భార్య అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ ఇన్‌చార్జి సీఐ శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈయన తండ్రి నారాయణ కూడా ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందారు.
Comments
Please login to add a commentAdd a comment