
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడిచింది. జనసేన ఆవిర్భావం నుంచి టీడీపీ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు పాకులాడటం తెలిసిందే. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన జనసేన, 2019లో టీడీపీని కాదని లెఫ్ట్ పార్టీలతో జట్టుకట్టింది. అయితే జనసేన బలం ఏంటో తేటతెల్లమైంది. జనసేనతో లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీ కలిసి పోటీ చేసినా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.15శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మరోవైపు అధికార వైఎస్సార్‌సీపీకి రికార్డు స్థాయిలో 51.5శాతం, ప్రతిపక్ష టీడీపీకి 35.10శాతం ఓట్లు దక్కాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే జనసేన కంటే కొన్ని నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీకి ఎక్కువ ఓట్లు పోలవడం. దీన్ని బట్టి చూస్తే జనసేన బలం ఏంటో? ఆ పార్టీ భవిష్యత్తు ఏంటో స్పష్టమవుతోంది.
సాక్షి ప్రతినిధి కర్నూలు: జనసేన ఆవిర్భవించి దశాబ్దకాలం అవుతున్నా ఇప్పటి వరకూ ఆ పార్టీకి రాజకీయ స్వరూపమే లేదు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ బాధ్యులు లేని పార్టీ జనసేన. బహుశా రాజకీయ స్వరూపం, పార్టీ నిర్మాణం లేని ఏకై క పార్టీ జనసేన మాత్రమే ఉంటుంది. దీన్నిబట్టే చూస్తే పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా నిర్మించి, ప్రజాసమస్యలపై పోరాటం చేద్దాం.. అధికార, ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనే ఆలోచన లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది.
చివరకు ప్రతిపక్షపార్టీ 23 సీట్లకే పరిమితమై ఘోర ఓటమితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనే ఆలోచన జనసేన చేయకపోవడం గమనార్హం. టీడీపీకే వంత పాడుతుండటం చూస్తే జనసేన అంతరార్థం, లక్ష్యం ఏంటో తెలుస్తోంది. పవన్‌కళ్యాణ్ కేవలం తన అవసరం కోసం ఓ పార్టీ స్థాపించడం, తనకు నచ్చిన వారికి మద్దతు ఇచ్చేందుకు, జనసేన పార్టీ పేరుతో కార్యకర్తలను వాడుకుని ఎన్నికల సమయంలో టీడీపీ జెండా మోయించడం మినహా మరో లక్ష్యం ఆ పార్టీకి లేదనేది స్పష్టం. కర్నూలు, నంద్యాల జిల్లాలోని రాజకీయపార్టీల నేతలు, విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీకి దూరమయ్యే యోచనలో జనసైనికులు, బలిజలు
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం ఓట్లు 40వేల దాకా ఉన్నాయి. నంద్యాలలో 35వేలకు పైనే. అలాగే బనగానపల్లి, డోన్‌లో కూడా మంచి ఓటు బ్యాంకు ఉంది.
► అయితే 2019 ఎన్నికల్లో 2057 ఓట్లు మాత్రమే జనసేనకు పోలయ్యాయి. అంటే 1.10శాతం మాత్రమే.
► నంద్యాలలో 5,995 ఓట్లు, అంటే 3.04 శాతం మాత్రమే పోలయ్యాయి. బనగానపల్లిలో మరీ ఘోరంగా 1504 ఓట్లు (0.80శాతం) మాత్రమే దక్కాయి.
► డోన్‌లో 2537ఓట్లు(1.46శాతం).. మంత్రాలయంలో 1394(0.87శాతం) ఓట్లు పోలయ్యాయి.
► దీన్నిబట్టి చూస్తే బలిజల ఓటు బ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా జనసేనకు ఏమాత్రం ఆదరణ లేదనేది స్పష్టమైంది.
► ఈ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీస్థానాల పరిధిలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజార్టీ సాధించింది.
► 55–60శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి వచ్చాయి. ఈ క్రమంలో ఇంత బలమైన వైఎస్సార్‌సీపీని ఢీకొట్టలేమని జనసేనతో పాటు జనసేనానికి కూడా తెలుసు.
► పదేళ్లుగా స్థిరత్వం, లక్ష్యం లేని రాజకీయం చేస్తున్న పవన్‌కళ్యాణ్ రానున్న సార్వత్రిక పోరులో ఒంటరిగా పోటీ చేస్తే 2019 కంటే ఘోరమైన ఫలితాలు వస్తాయని ఇప్పటికే అర్థమైంది.
► కలిసి పోటీ చేస్తామని గురువారం ప్రకటించినా, ప్రజలందరూ మొదటి నుంచి టీడీపీ, జనసేనను ఒకే పార్టీగా చేస్తున్నారు.
ప్రత్యామ్నాయం తప్పనట్లే..
వాస్తవానికి 14చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా జనసేనకు లేరు. ‘బ్రో’ సినిమా నిర్మాత, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ బంధువు టీజీ విశ్వప్రసాద్ మాత్రమే ఆదోని బరిలోకి దిగే యోచనలో ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం, గత ఎన్నికల్లో ఆదోనిలో అత్యధికంగా జనసేనకు 11,836(7.54శాతం) ఓట్లు రావడంతో జనసేన బరిలో టీజీ విశ్వప్రసాద్ బరిలో ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే మీనాక్షినాయుడు కుటుంబం సీటు వదులుకోవల్సిందే. మరో వైపు భూమా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈక్రమంలో ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లలో కూడా ఓ సీటును జనసేన ఆశించే పరిస్థితి ఉంది. దీంతో టీడీపీ నేతల్లో కూడా గుబులు మొదలైంది. పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్లు ఇస్తే తమ పరిస్థితి ఏంటని ఆలోచలో పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఇదే క్రమంలో మనస్సాక్షికి విరుద్ధంగా టీడీపీ జెండా మోసి చంద్రబాబు కోసం పనిచేయాల్సిన పరిస్థితి రావడంతో జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం జనసేన ఎన్‌డీఏలో కొనసాగుతోంది. అలాంటిది ఎన్‌డీఏలో లేని టీడీపీతో పవన్ జత కట్టడం బీజేపీ శ్రేణులను కూడా గందరగోళానికి గురిచేస్తోంది. మూడు జెండాల తికమకలో జన సైనికులు పిచ్చెక్కిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కంటే పక్కకు తప్పుకోవడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారు.
పవన్‌కళ్యాణ్ ప్రకటనపై జనసైనికులు నిర్వేదంలో మునిగిపోయారు. తాము ఏ పార్టీలో ఉన్నామో, ఎవరి కోసం పనిచేస్తున్నామో తెలియని అయోమయంలో ఉన్నామని, బహుశా ఏ పార్టీ కార్యకర్తలకు ఈ వేదన ఉండదనే చర్చ జరుగుతోంది. పార్టీని నడపటం చేతకానప్పుడు, రాజకీయం తెలియనప్పుడు పార్టీని టీడీపీలో విలీనం చేస్తే సరిపోతుందని ఆళ్లగడ్డకు చెందిన ఓ జనసేన పార్టీ నేత ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment