గాలేరు లైనింగ్ పనులు గాలికి!
పాణ్యం: గాలేరు నగరి లైనింగ్ పనులను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. కృష్ణా జలాలు కడలిలో కలవకుండా రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గాలేరునగరి సుజల స్రవంతి పథకానికి శుంకుస్థాపన చేశారు. ఈ కాల్వ ద్వారా పోతిరెడ్డిపాడు, బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు అక్కడి నుంచి గోరుకల్లు జలాశయంలోకి నీరు వచ్చి చేరుతుంది. గోరుకల్లు నుంచి నగరికి 30 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో దిగువకు నీటిని తరలించేందుకు కాల్వను డిజైన్ చేసి పనులు ప్రారంభించారు. వైఎస్సార్ పాలనలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఆయన మరణాంతరం వచ్చిన ప్రభు త్వాలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయి. 2014లో వచ్చిన టీడీపీ ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న కాల్వలో 2017 నవంబర్ 6న గోరుకల్లు నుంచి అవుకు వరకు నీటిని వదిలారు. అయితే కాల్వ వెంట లీకేజీలు, అసంపూర్తి పనులు వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరలేదు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో
వేగంగా లైనింగ్ పనులు
గాలేరు నగరి సుజల స్రవంతి కాల్వల లీకేజీలను అరికట్టేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టింది. 2021 ఫిబ్రవరిలో గోరుకల్లు జీరో రెగ్యులేటర్ నుంచి అవుకు టన్నెలు మొదలుకొని దాదాపు 57.7 కిలోమీటర్ల పనులు ప్రారంభించారు. ఇందుకు రూ.1,269 కోట్లు మంజూరు చేశారు. లైనింగ్ పనులు అన్ని చోట్లా పూర్తి చేశారు. జీరో రెగ్యులేటర్ వద్ద, అవుకు టన్నెల్‌లో కొంతభాగం పెండింగ్‌లో ఉంది. ఈలోపు ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి.
పెండింగ్‌లోనే పనులు..
అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం లైనింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. పనులు పురోగతి, చేయాల్సిన పనులపై ఇంతవరకు సమీక్ష నిర్వహించకపోవడం, ముందకు వెళ్లే ప్రణాళికలు రూపొందించకపోవడంపై సర్వతా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెండింగ్ పనులతోపాటు గోరుకల్లు ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పెండింగ్ పనులపై
నోటీసులు ఇస్తున్నాం
గాలేరు నగరి లైనింగ్ పనులపై కాంట్రాక్టర్లకు నోటీసులు ఇస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు సమాచారం ఇచ్చాం. పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కాంట్రాక్టర్లు రాని విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పనులు జరిగేలా చూస్తాం. – సురేష్ ఈఈ
పెండింగ్ పనులను పట్టించుకోని కూటమి సర్కార్
Comments
Please login to add a commentAdd a comment