కాలిగ్రఫిలో కర్నూలు విద్యార్థిని ఉత్తమ ప్రతిభ
ఒకప్పటి డ్రాపవుట్ స్టూడెంట్
నేడు మూడు బాషల్లో గోల్డ్‌మెడల్ కైవసం
కర్నూలు(హాస్పిటల్): మన చేతి రాతిను బట్టి మన వ్యక్తిత్వం తెలుస్తుందంటారు. అయితే, ఆ యువతి తలరాతను భగవంతుడు సరిగ్గా రాయకపోయినా కుంగిపోలేదు. తన తలరాతను తనే మార్చి రాసుకుంది. చదువులో ఉన్నతంగా రాణిస్తూ కాలిగ్రఫిలో ఏకంగా గోల్డ్‌మెడల్ సాధించింది కర్నూలు మండలం వెంకాయపల్లె గ్రామానికి చెందిన షేక్ షబానా (25). ఈ యువతి పాఠశాల విద్యను స్థానికంగా చదువుతూ ఏడో తరగతిలో డ్రాపవుట్ అయ్యింది. ఆ తర్వాత షబానాను తల్లిదండ్రులు బలవంతంగా బాల్య వివాహం చేశారు. పెళ్లి ఇష్టంలేని ఆ బాలిక కర్నూలులోని ఉమెన్ ఆర్మీ సంస్థను సంప్రదించింది. వారు దత్తత తీసుకుని 10వ తరగతి, ఇంటర్ దూరవిద్య ద్వారా చదివించారు.
అనంతరం హైదరాబాద్‌లోని ఎన్సీపీయూఎల్లో చేర్పించారు. అక్కడ మాస్టర్ పాన్ మహమ్మద్ అబ్దుల్ గఫూర్ సూచనలు, సలహాలతో డిప్లమా ఇన్ అరబిక్, డిప్లమా ఇన్ ఉర్దూ, డిప్లమా ఇన్ కాలిగ్రఫి అభ్యసించింది. ఉర్దూ, అరబిక్, ఇంగ్లిష్ భాషలను కాలిగ్రఫిలో ఉత్తమ ప్రతిభ కనబరచింది. కేంద్ర ఉన్నత విద్య, ఉర్దూ బాష జాతీయ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లోని ఇదార్ ఇ అరబియాత్ ఇ ఉర్దూ సెంటర్లో కాలిగ్రఫి, గ్రాఫిక్ డిజైన్ ట్రైనింగ్ సెంటర్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 6 నుంచి 24వ తేది వరకు 2022–24 బ్యాచ్ విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రపంచ పురాతన కాలపు అక్షరాలు, ఇస్లామ్ పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్‌ను లిఖించిన అక్షరాలు, అరబిక్, ఉర్దూ, ఇంగ్లిష్ భాషాలకు సంబంధించిన వివిధ ఫాంట్స్‌తో కాగితం, బియ్యం, గింజ, మేకచర్మం, కోడిగుడ్డు, బాదాం గింజలపై అద్భుత చిత్రాలను ఖురాన్లో చెప్పిన ప్రవచనాలను ప్రదర్శించారు.
ఇందులో షేక్ షబానా సృజనాత్మక ప్రదర్శనకు దక్కన్ ఇనామ్ డైలీ లీడర్ అవార్డుతో పాటు గోల్డ్‌మెడల్ సాధించింది. ఈ నెల 24వ తేదిన బంగారు పతకం, సర్టిఫికెట్‌ను అధికారులు ఆమెకు ప్రదానం చేసి సత్కరించారు. ఏపీలో కాలిగ్రఫిలో ఈ కోర్సులు పూర్తి చేసిన మొదటి యువతి షబానా కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment