సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గుర్తు తెలియని దుండగుల దాడి
బేతంచెర్ల: మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామ సమీపాన బేతంచెర్ల – నంద్యాల రహదారిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి గాయపరిచారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. బేతంచెర్ల పట్టణానికి చెందిన చంద్ర కుమారుడు జశ్వంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.ఈ యువకుడు ఆదివారం నంద్యాలకు వెళ్లి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసుకొని బేతంచెర్లకు బయలు దేరాడు. సిమెంట్ నగర్ సమీపాన బేతంచెర్ల నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కోళ్లఫారానికి సంబంధించిన బొలెరో వాహనం ఎదురొచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై నుంచి జశ్వంత్ కింద పడగానే బొలెరోలో ఉన్న గుర్తు తెలియని దుండగులు కిందకు దిగి రాళ్లు, రాడ్డుతో తలపై దాడి చేసి ఆ యువకుడి చేతికి ఉన్న నాలుగు తులాల బంగారు కడియం, రెండు రింగులను బలవంతంగా లాక్కున్నారు. తర్వాత ఆ యువకుడు ఆర్టీసీ బస్సు ఎక్కి బేతంచెర్లకు వెళ్లాడు. అక్కడ స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకొని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్‌ఐ రమేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బంగారం కోసం దాడి చేశారా లేక మరేదైనా కారణం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment