గొంతులు ఎండుతున్నాయ్‌ ! | - | Sakshi
Sakshi News home page

గొంతులు ఎండుతున్నాయ్‌ !

Published Mon, Mar 17 2025 9:44 AM | Last Updated on Mon, Mar 17 2025 11:02 AM

● తాగునీటి సమస్యపై అధికార, ప్రతిపక్ష సభ్యులు గగ్గోలు ● హామీ ఇవ్వకుండా మంత్రి టీజీ భరత్‌ వెళ్లిపోవడంపై అసహనం ● నీటి పారుదలపై సుదీర్ఘ చర్చ

కర్నూలు(అర్బన్‌): వేసవి ప్రారంభంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అనేక గ్రామాల ప్రజల గొంతులు ఎండుతున్నాయని అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆలూరు, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు బి. విరూపాక్షి, గౌరు చరితారెడ్డి, జి. జయసూర్య, కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు పి. రంజిత్‌బాషా, రాజకుమారి గణియా, కర్నూలు జేసీ డా.బి. నవ్య, ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ మాన్వి దేవేంద్రప్ప, జెడ్పీ సీఈఓ జి. నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. అజెండాలో పొందుపరిచిన విధంగా తాగునీరు, వ్యవసాయం, ఇరిగేషన్‌ శాఖలపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన 60కి పైగా సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు ఉన్నాయని, వాటి నిర్వహణను ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తున్నారా? అని రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ ప్రశ్నించారు. కట్టలు బలహీనపడి పోవడం, లీకేజీలను పరిశీలించకుంటే సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. వాటిని తనిఖీ చేసి నివేదికలు అందించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు.

రిజర్వాయర్ల విస్తరణ చేపట్టాలి..

ఎమ్మెల్యే విరూపాక్షి

ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. జనాభా పెరిగిన నేపథ్యంలో చింతకుంట, బాపురం రిజర్వాయర్లను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆలూరు చెరువు అన్యాక్రాంతం కాకుండా ఎస్‌ఎస్‌ ట్యాంకును నిర్మించాలన్నారు. సమ్మతగేరిలో ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మించాలని, కోగిలతోట గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను తొలగించి కొత్త ఓహెచ్‌ఎస్‌ఆర్‌ను నిర్మిస్తుండడం వల్ల గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య ఉందన్నారు. పందికోన రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ వేస్తే ఆస్పరి మండలంలోని పలు గ్రామాల నీటి సమస్య తీరే అవకాశం ఉందన్నారు. అలాగే తుంగభద్ర డ్యామ్‌ గేట్లకు సంబంధించిన చైన్‌ లింకులను మొత్తం మార్చాలని కేంద్ర బృందం సూచించిందని, ఇందుకు రూ.150 కోట్ల వరకు వ్యయం కానుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నయాపైసా కూడా కేటాయించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు.

మంత్రికి ప్రజల సమస్య పట్టదా..

సమావేశం జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, జయసూర్య వెళ్లిపోవడం పట్ల ఆలూరు ఎమ్మెల్యే బి. విరుపాక్షితో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత వేసవిలో నెలకొన్న తాగునీటి సమస్యపై సుదీర్ఘ చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రిగా ఎలాంటి హామీ ఇవ్వకుండా వెళ్లడం ఏమిటని వారు ప్రశ్నించారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులకు సంబంధించి పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాల్లో తమ వాణిని వినిపించాల్సిన ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వెళ్లిపోవడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.

నీటి వృథాను అరికట్టేందుకు రిజర్వాయర్లు అవసరం

... జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి

కర్నూలు జిల్లాకు పైభాగాన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన అధిక వర్షాల వల్ల గత ఏడాది జూరాల నుంచి 1200 టీఎంసీలు, సుంకేసుల నుంచి 300 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేని కారణంగా ప్రతి ఏడాది దాదాపు 540 టీఎంసీల నీరు వృథా అవుతుందన్నారు. వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి అయితే నీటి వృథాను కొంతమేర అరికట్టడంతో పాటు సాగు, తాగునీటికి ఉన్న ఇబ్బందులు తొలగే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రబీ సీజన్‌లో ఏర్పడిన ఎరువుల కొర త ఖరీఫ్‌లో రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

రూ.6.47 కోట్ల పనులకు ఆమోదం

జిల్లా పరిషత్‌ సాధారణ నిధులు, 2024–25 ఆర్థిక సంవత్సరం నిధులు, మిగులు నిల్వలు కలిపి మొత్తం రూ.6.47 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఆదివారం జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 147 పనులను చేపట్టేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు.

గొంతులు ఎండుతున్నాయ్‌ ! 1
1/1

గొంతులు ఎండుతున్నాయ్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement