● కర్నూలు కళాశాల బాలికల
వసతిగృహంలో జేడీ రంగలక్ష్మిదేవి బస
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు తప్పక హాస్టళ్లలో బస చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ జె.రంగలక్ష్మిదేవి ఆదేశించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వార్డెన్లు రాత్రి సమయాల్లో హాస్టళ్లలోనే నిద్రించి విద్యార్థులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. అలాగే ఆయా హాస్టళ్లలో స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. బాలల సంరక్షణ చట్టాలు, ఫోక్సో యాక్ట్, చైల్డ్ హెల్ప్‌లైన్ తదితర నెంబర్లను విద్యార్థులకు తెలియజేయాలన్నారు. జేడీతో పాటు హెచ్‌డబ్ల్యూఓ పెన్నమ్మ కర్నూలు కళాశాల బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలసి నిద్రించారు. అలాగే కళాశాల బాలుర వసతి గృహంలో కర్నూలు సహాయ సంక్షేమాధికారి బి.మద్దిలేటి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటరెడ్డి బస చేశారు.