కర్నూలు(అగ్రికల్చర్): ఏపీ ఎన్‌జీవో అసోషియేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ నుంచి నలుగురు కార్యవర్గసభ్యులను బహిష్కరిస్తూ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర నాయకత్వం నిలుపుదల చేసింది. సంఘం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఇటీవల జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్‌లాల్, ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, రమణ, కోశాధికారి బాస్కరనాయుడులను ముందుగా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సంఘం నుంచి బహిష్కరించారు. దీనిపై నలుగురు నేతలు రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయించారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్‌లను తాము ఆదేశాలు ఇచ్చేంత వరకు తాలూకా ఎన్నికలు నిర్వహించవద్దని జిల్లా నాయకత్వాన్ని ఆదేశించారు. దీంతో మొదటిసారిగా జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డికి ఎదురు దెబ్బతగిలినట్లు అయింది. తాజా నలుగురిపై సస్పెన్షన్, బహిష్కరణ ఉత్వర్వులను కూడా నిలుపుదల చేయడం గమనార్హం.
● జిల్లా అధ్యక్షునిగా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వెంగళ్‌రెడ్డి త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. తన వారసుడిని కూడా ఏకపక్షంగా సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అసోసియేషన్‌లో విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది.
బైక్ దగ్ధం
సి.బెళగల్: మండల కేంద్రం సి.బెళగల్ శివారులో గురువారం షార్ట్ సర్క్యూట్‌తో ఓ బైక్ దగ్ధమైంది. ఇనగండ్ల గ్రామానికి చెందిన మద్దిలేటి తన హోండా షైన్ బైక్‌పై సి.బెళగల్‌కు వస్తుండగా మార్గమధ్యలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో సాంకేతిక సమస్యతో నిలిచి పోయింది. పరిశీలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో బైక్ పూర్తిగా కాలి పోయింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది.
హిజ్రాల రాళ్ల దాడి
బొమ్మలసత్రం: పట్టణంలోని టూటౌన్, తాలుకా పోలీస్‌స్టేషన్ల మధ్య రెండు వర్గాలకు చెందిన హిజ్రాలు రాళ్లు, కారం పొడితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. రానున్న పండుగల నేపథ్యంలో పట్టణానికి చెందిన హిజ్రాలు దుకాణాల యజమానుల వద్ద పండుగ మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఈక్రమంలో మరో వర్గం ఎదురు కావడంతో ఒకరికొకరు దాడులు చేసుకుని ఒక గుంపు తాలుకా స్టేషన్ వద్దకు.. మరో గుంపు టూటౌన్ వద్దకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. రెండు పోలీస్టేషన్లు పక్కపక్కనే ఉండడంతో రెండు వర్గాలు మరోసారి దాడి చేసుకున్నాయి. రాళ్లు, కారంపొడి పొట్లాలు ఒకరిపై మరొకరు విసిరి దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులను సైతం లెక్క చేయకుండా జనావాసాల మధ్య రాళ్లు విసురుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిజ్రాలను పోలీసులు క్రమశిక్షణలో ఉంచకపోతే సామాన్యులను రోడ్లపైకి రానివ్వరేమోనని ఆందోళన చెందుతున్నారు.
బహిష్కరణ ఉత్తర్వులు నిలుపుదల