
పెట్రోల్ బంకులో దోపిడీ దొంగల బీభత్సం
ఆదోని రూరల్: పెట్రోల్ బంకులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సిబ్బంది గొంతుపై కత్తులు పెట్టి బెదిరించి రూ.60 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను చోరీ చేశారు. పెద్దతుంబళం గ్రామంలోని మాధవరం రోడ్డులో ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంకుకు శుక్రవారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో ఏడుగురు వచ్చారు. వారిలో ఐదుగురు పెట్రోల్ బంకులోకి చొరబడి తమ వాహనానికి పెట్రోల్ వేయాలని నిద్రిస్తున్న పెట్రోల్ బంకు సిబ్బంది ఈరన్న, తాయప్పలను లేపారు. పెట్రోల్ కొట్టించుకున్న అనంతరం సిబ్బంది గొంతుపై కత్తులు పెట్టి డబ్బులు ఎక్కడున్నాయో చూపించాలని బెదిరించారు. పెట్రోల్ బంకులో బీరువాను పగులగొట్టారు. సీసీ ఫుటేజీ బాక్సు, విద్యుత్ సరఫరా వైర్లను కత్తిరించి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.60 వేలు, రెండు సెల్‌ఫోన్‌లను దొంగలించుకుని వెళ్లారు. బొలెరో వాహనంలో కోసిగి వైపు వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీలో తేలిందని ఎస్‌ఐ తెలిపారు. ఈరన్న, తాయప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
రూ.60 వేల నగదు, రెండు సెల్‌ఫోన్ల చోరీ

పెట్రోల్ బంకులో దోపిడీ దొంగల బీభత్సం