
వైద్యుల నియామకాలు, పదోన్నతులు గత ప్రభుత్వంలోనే..
కర్నూలు మెడికల్ కాలేజీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా 126 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిగింది. ఈ మేరకు అప్పటి వరకు అసోసియేట్‌గా పదోన్నతులు లభించని అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించి ఖాళీలు భర్తీ చేశారు. దీంతో పాటు అదనంగా నాలుగు ప్రొఫెసర్, 22 అసోసియేట్, 61 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేసి భర్తీ చేశారు. వైద్యులకు సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించేందుకు ముందుగా దీర్ఘకాలంగా ఒకేచోట ఉన్న వారిని బదిలీ చేశారు. అనంతరం సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించి కౌన్సెలింగ్ ద్వారా స్థానాలు కేటాయించారు. ఆ తర్వాత పరస్పర బదిలీలనూ నిర్వహించారు. ఈ క్రమంలో కోరుకున్న ప్రాంతానికి చాలా మంది వైద్యులు చేరుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో పోస్టుల భర్తీ లేదు, పదోన్నతుల ఊసే లేకపోవడం గమనార్హం.
ఆసుపత్రిలో నిలిచిపోయిన
ఐపీ భవనం పనులు
సమస్యల వలయంలో
పెద్దాసుపత్రి
● బోధనాసుపత్రిపై రాష్ట్ర ప్రభుత్వం
చిన్నచూపు
● నిధులు కేటాయించక
నిలిచిన నిర్మాణాలు
● నత్తనడకన సాగుతున్న
డ్రగ్ కంట్రోల్ ల్యాబ్
● గత ప్రభుత్వంలో నాడు–నేడుతో
ఎనలేని ప్రగతి
● ఆసుపత్రి చరిత్రలోనే అత్యధికంగా
పోస్టుల భర్తీ
● నేడు పీజీ సీట్లు కోల్పోయే పరిస్థితి
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. ఎక్కడికక్కడ నిలిచిపోయిన భవనాలు, పాత భవనాల్లో చాలీ చాలని వసతులు, మందుల కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాలపై చిన్నచూపు చూడటమే ఈ పరిస్థితికి కారణమవుతోంది. రూ.500కోట్ల అంచనాతో చేపట్టిన అభివృద్ధి పనులను పట్టించుకోకపోవడం వల్ల ఆసుపత్రిలో అడుగడుగునా ఇబ్బంది తలెత్తుతోంది. రాజధాని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలిన నేపథ్యంలో ఏర్పాటైన కర్నూలు మెడికల్ కాలేజి, జనరల్ హాస్పిటల్ అభివృద్ధి నత్తనడకన సాగింది. 50 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభమైన ఈ కళాశాల ప్రస్తుతం 250 సీట్లకు నోచుకుంది. అది కూడా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవతో 50 సీట్లు వచ్చాయి. గతంలో సూపర్‌స్పెషాలిటి పీజీ చదవాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితిలో గత ప్రభుత్వం దాదాపు అన్ని విభాగాల్లో పీజీ సీట్లను మంజూరు చేసింది. అలాగే స్పెషాలిటీ కోర్సుల్లోని పీజీ సీట్లు 2019కి ముందు 138 మాత్రమే ఉండగా.. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అదనంగా మరో 26 సీట్లు పెరిగి మొత్తం పీజీ సీట్ల సంఖ్య 164కు చేరింది. 2019కి ముందు ఆసుపత్రిలో 300 వరకు మాత్రమే స్టాఫ్‌నర్సులు ఉండగా.. ఆ సంఖ్యను గత ప్రభుత్వం 800లకు చేర్చింది. ఫలితంగా రోగులకు నర్సింగ్ సేవలు చేరువయ్యాయి. ఇక 2019 వరకు 140 దాకా ఉన్న పీజీ సీట్ల సంఖ్య గత ప్రభుత్వంలో మ రో 35 మంజూరయ్యాయి. అదేవిధంగా 2019 వరకు కేవలం నాలుగు మాత్రమే ఉన్న సూపర్‌స్పెషాలిటీ సీట్ల సంఖ్య ఏకంగా 19కి చేరుకోవడం గత వైఎస్సార్‌సీపీ ఘనతగా ఆసుపత్రిలోనే చర్చ జరుగుతోంది.
గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి గండం
ఆసుపత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్‌ఎంసీ) గండం పొంచి ఉంది. గత ప్రభుత్వంలో ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండేవారు. దీంతో పాటు ఈ విభాగానికి పీజీ సీట్లు కూడా మంజూరు కావడంతో అధిక సంఖ్యలో పీజీ వైద్యులు ఉన్నారు. దీనివల్ల ఇక్కడ సేవలు గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత కొంత కాలానికి ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్ రిటైర్ కావడం, ఇద్దరు అసిస్టెంట్లు లాంగ్ లీవ్ పెట్టడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఒక్కరే అన్ని పనులూ చేయాల్సి వస్తోంది. రోగులకు వైద్యం అందిస్తూ పీజీలకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీచింగ్ ఫ్యాకల్టీ లేరని చెబుతూ ఉన్న పీజీ సీట్లను ఎన్‌ఎంసీ రద్దు చేసే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు.
నత్తనడకన రీజినల్ డ్రగ్ టెస్టింగ్
ల్యాబోరేటరీ పనులు
నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగానే రీజినల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబోరేటరీకి 2019లోనే నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. 2023లో ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాక పనులు ప్రారంభమయ్యాయి. రూ.1.79కోట్లతో ఈ పనులు కొంత కాలం వేగంగా కొనసాగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తయితే ఔషధ నియంత్రణ శాఖ పరిపాలనా విభాగంతో పాటు రాయలసీమ స్థాయిలో ఔషధాలను పరీక్షించేందుకు ల్యాబోరేటరీ కూడా అందుబాటులోకి రానుంది.
బిల్లుల పెండింగ్ వల్లే ఆలస్యం
ఆసుపత్రిలోని ఐపీ భవనం, లెక్చరర్ గ్యాలరీ తదితర పనులు నిధుల లేమి వల్లే నిలిచిపోయాయి. ఈ రెండు పనులూ ఒకే అగ్రిమెంట్ కింద అయ్యాయి. ఒకే కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు. అతనికి రూ.17.89కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికోసం ఎదురుచూస్తూ పనులు నిదానం చేస్తున్నారు. బిల్లులు రాగానే పనుల్లో వేగం పుంజుకునే అవకాశం ఉంది.
– ఎస్.కరీముల్లా,
ఏపీఎంఎస్‌ఐడీసీ ఇన్‌చార్జి ఈఈ, కర్నూలు
ఆగిపోయిన అభివృద్ధి పనులు
గత వైసీపీ ప్రభుత్వం నాడు–నేడులో భాగంగా కర్నూలు మెడికల్ కాలేజి, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు నిర్మాణాలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా రూ.350కోట్లు నిర్మాణాలకు, రూ.150కోట్లు పరికరాలకు కేటాయించారు.
ఇందుకు సంబంధించి ఐపీ భవనం, కళాశాలలో లెక్చరర్ గ్యాలరీలు, సెమినార్‌హాల్స్, హాస్టళ్ల నిర్మాణాల పనులు కొనసాగాయి.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వీటి నిర్మాణాలు ఆగిపోయాయి.
శరవేగంగా పనులు జరుగుతున్న ఐపీ భవనం, 80 శాతానికి పైగా పూర్తయిన లెక్చరర్ గ్యాలరీ, డ్రగ్ కంట్రోల్ టెస్టింగ్ ల్యాబ్ పనులు నిలిచిపోయాయి.
ఐపీ భవన నిర్మాణం ఆగిపోవడం వల్ల పాత భవనాల్లో ఇరుకు పరిస్థితుల్లోనే రోగులకు చికిత్స చేస్తున్నారు.

వైద్యుల నియామకాలు, పదోన్నతులు గత ప్రభుత్వంలోనే..