
మద్దిలేటయ్య క్షేత్రంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కనిపించింది. చైత్ర మాసం కావడంతో నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు దర్శించుకున్నారు. పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేయడంతోపాటు మహా మంగళహారతి ఇచ్చారు.
దాతలు సహకరించాలి
శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో గదులు నిర్మించిన దాతలు భక్తుల రద్దీ దృష్ట్యా సహకరించాలని ఆలయ ఉపకమిషనర్, ఈఓ రామాంజనేయులు శనివారం తెలిపారు. గతంలో దాతలకు ఏడాదిలో ఐదుసార్లు ఉచితంగా గదులను ఇచ్చేవారమన్నారు. ప్రస్తుతం పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా పాసులను నెల ముందు పంపాలని సూచించారు. ఒక్కసారి పాసు వాడిన తరువాత మరొక పాసుకు వ్యవధి 10 వారాలు ఉండాలన్నారు.
వైభవంగా వసంతోత్సవం
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి రాయబారాది జ్యోతి మహోత్సవాలు వసంతోత్సవంతో శనివారం ముగిశాయి. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ.. ఉదయం శ్రీ చౌడేశ్వరిదేవి, శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి సమీపంలో ఉన్న కోనేరు వరకు వసంతోత్సవం నిర్వహిస్తూ తీసుకెళ్లారు. అనంతరం కోనేరులోని నీటితో విగ్రహాలను శుభ్రం చేసి మళ్లీ ఆలయానికి తీసుకొచ్చారు. భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మద్దిలేటయ్య క్షేత్రంలో భక్తుల రద్దీ