
పొట్టేళ్ల పందెం అదుర్స్
పగిడ్యాల: శ్రీరామనవమి తిరునాల పురస్కరించుకుని సోమవారం స్థానిక బస్టాండు ఆవరణలో ఏర్పాటు చేసిన పొట్టేళ్ల పందెం అదుర్స్ అనిపించింది. పొట్టేళ్లు ఢీ అంటే ఢీ అంటూ ఒకదానికి ఒకటి ఢీకొట్టుకోగా వీక్షకులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. ఆహుతుల హర్షధ్వానాల మధ్య పోటీలు ఉత్కంఠగా సాగాయి. పోటీల్లో అల్లర్లు చోటుచేసుకుండా ముచ్చుమర్రి పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి 12 పొట్టేళ్లు పోటీపడగా మొదటి బహుమతి చెరుకుచెర్ల, రెండవ బహుమతి ప్రాతకోట, మూడవ బహుమతి పగిడ్యాల గ్రామాలకు చెందిన పొట్టేళ్ల యజమానులకు లభించాయి. విజేతలైన పొట్టేళ్ల యజమానులకు ఈడిగ సుధాకర్‌గౌడ్ నగదు బహుమతులను అందజేశారు.
కారులో చెలరేగిన మంటలు
● ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ముగ్గురు
నందికొట్కూరు: మిడుతూరు మండల పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా సి.బెళగల్‌కు చెందిన అమానుల్లా మిడుతూరు మండలంలోని బైరాపురం యువతిని వివాహం చేసుకున్నారు. రంజాన్ పండుగకు భార్య పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు భర్త కారులో వచ్చాడు. కారు రిపేరు కావడంతో మరో ఇద్దరు బంధువులతో కలిసి బైరాపురం నుంచి నందికొట్కూరుకు మెకానిక్ కోసం వచ్చారు. రాత్రి వేళ మెకానిక్ అందుబాటులో లేకపోవడంతో బైరాపురం గ్రామానికి తిరిగి వస్తుండగా నందికొట్కూరు–మిడుతూరు మార్గ మధ్యలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మంటల్లో కారు పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

పొట్టేళ్ల పందెం అదుర్స్