
నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
మంత్రాలయం: పిల్లలకు వడ్డించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మంత్రాలయం, మాధవరం జిల్లా ఉన్నత పాఠశాలలు, రచ్చుమర్రి మోడల్ స్కూల్, చిలకలడోణ పాఠశాలలోని తనిఖీలు చేపట్టారు. మాధవరం గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌లను సందర్శించారు. మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం వంట చేయకపోవడంతో వంట ఏజెన్సీపై త్రిసభ్య కమిటీకి ఫిర్యాదు చేశారు. రచ్చుమర్రి ఆదర్శ పాఠశాలలో భోజనాన్ని పరిశీలించి గడువు ముగిసిన రాగి పిండి, బెల్లం ఎలా వినియోగిస్తారంటూ ఏజెన్సీ నిర్వాహకులను నిలదీశారు. చిలకలడోణ కస్తూర్బా గాంఽధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి వంటశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదే గ్రామంలో అంగన్‌వాడీ సెంటర్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. మాధవరం అంగన్‌వాడీ సెంటర్‌లో రికార్డులు సక్రమంగా లేకపోవడంతో కార్యకర్త తులసి, సూపర్ వైజర్ నాగలక్ష్మి, మాధవరం పాఠశాలలో విద్యార్థులకు కోడిగుడ్లు సరఫరా చేయకపోవడంతో హెచ్‌ఎం, బాధిత ఉపాధ్యాయుడికి మెమోలు జారీ చేశారు. అంతకు ముందు రాఘవేంద్ర స్వామిని, గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. ఆయన వెంట జిల్లా సివిల్ సప్‌లై ఆఫీసర్ రాజారఘువీర్, పీడీ నిర్మల, డిప్యూటీ ఈఓ వెంకటరమణారెడ్డి, సీడీపీఓ నరసమ్మ, తహసీల్దార్ రవి, ఎస్‌ఐ విజయ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ ఉన్నారు.
ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి