
త్వరలో ట్రెజరీ ఉద్యోగుల సంఘానికి ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘానికి త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నామని ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌బాబు తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీలో ఏర్పాటు చేసిన సమావేశంలో శోభన్‌బాబు మాట్లాడుతూ ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించారు. రాష్ట్ర సంఘం ద్వారా ట్రెజరీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించామని, అర్హులైన వారందరికి పదోన్నతులు లభించే విధంగా కృషి చేశామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేసినందున రాష్ట్రంలో ఇపుడున్న సంఘానికి మరోసారి అవకాశం కల్పించాలన్నారు. ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్ వెంగళ్‌రెడ్డి మాట్లాడుతూ పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు కరుణాకర్, రఘునందన్, మురళీధర్‌నాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు.