ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి?
● సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఘటన
● సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసిన టీజీఎంసీ
నెక్కొండ/ఎంజీఎం: కొందరి ఆర్‌ఎంపీల వైద్యానికి నిత్యం ఏదో ఒక చోట అయాయకులు బలవుతున్నారు. తాజాగా మండలంలోని ముదిగొండకు చెందిన కావటి మణిదీప్ (10) కూడా ఆర్‌ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరలైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కావటి కోటేశ్వర్, సరిత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మణిదీప్ ఇటీవల కుక్క కాటుకు గురయ్యాడు. దీంతో గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ అశోక్.. ఈ నెల 11వ తేదీన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశాడు. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీనిపై సదరు ఆర్‌ఎంపీ.. గుట్టుచప్పడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రహస్య ఒప్పంద కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం వైరల్ కావడంతో తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) వెంటనే స్పందించి సుమోటోగా స్వీకరించింది. దీంతో వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ బృందానికి జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని చైర్మన్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య సోమవారం ఆదేశించారు. కాగా, వరంగల్ టీజీఎంసీ సభ్యుడు శేషుమాధవ్, టీజీఎంసీ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్‌కుమార్, రాష్ట్ర ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్‌మియా, వరంగల్ హెచ్‌ఆర్‌డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి, తానా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనుందని ఆదేశాల్లో పేర్కొంది.
విద్యుదాఘాతంతో రైతు..
కొత్తగూడ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎదుళ్లపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జినుకల రాజు(24) నాటు వేయడానికి తన పొలం సిద్ధం చేశాడు. ఈ క్రమంలో నీరు పారించడానికి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడం.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. దీంతో పొలం వద్దకు వెళ్లి చూడగా మోటార్ వద్ద షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు సింహద్రి, నాగమల్లు గుండెలవిసేలా రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment