అరచేతిలో
20 ఫీచర్లతో అందుబాటులోకి..
యాప్ రూపొందించిన టీజీ ఎన్పీడీసీఎల్
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో టీజీ ఎన్పీడీసీఎల్ ఓ యాప్‌ను రూపొందించింది. సుమారు 20 ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా ఇంట్లోనే ఉండి సమస్యలపై ఫిర్యాదు చేయడంతోపాటు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, నూతన సర్వీస్‌ల మంజూరు, పేరు మార్పు వంటి సేవలు పొందే అవకాశముంది.
రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్: ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా ఇందులో జీపీఎస్ లోకేషన్ ద్వారా వినియోగదారుడి ఫోన్ కెమెరా నుంచి ఆ ఘటన ఫొటో తీసి పంపవచ్చు. తద్వారా రిపోర్ట్ నేరుగా సంబంధిత అధికారికి వెళ్తుంది. దీంతో సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
కన్జ్యూమర్ గ్రీవెన్స్: వినియోగదారుడి సమస్యలు నేరుగా ఇందులో పొందుపరచవచ్చు. వినియోగదారుడి మీటర్ నంబర్, సమస్య వివరాలు ఇందులో నమోదు చేస్తే సమస్యను పరిష్కరిస్తారు. విద్యుత్‌కు సంబంధించి ఏ అంశమైనా ఫిర్యాదు చేసే సౌకర్యం ఈ యాప్‌లో అందుబాటులో ఉంది. ఫిర్యాదు స్టేటస్ చూసుకునే సౌలభ్యం ఉంది. సమస్య పరిష్కారంపై సంతృప్తి చెందకపోతే పునరావృతం చేసుకునే వీలుంది.
సెల్ఫ్ రీడింగ్: ఈ యాప్ ద్వారా వినియోగదారులు సెల్ఫ్ రీడింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతీ నెల నిర్ణీత తేదీన వారి విద్యుత్ బిల్లులను సెల్ఫ్ మీటర్ రీడింగ్ తీసుకోవచ్చు.
పే బిల్స్: నెలవారీ విద్యుత్ బిల్లులను వినియోగదారుల సర్వీస్ నంబర్ నమోదు చేసుకొని చెల్లించవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది. బిల్ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
బిల్ హిస్టరీ: వినియోగదారులు చెల్లించిన విద్యుత్ బిల్లుల గత చరిత్ర ఇందులో చూసుకోవచ్చు. తద్వారా ప్రతీ నెలా బిల్లు ఎంత వస్తుంది పోల్చుకోవచ్చు. అలాగే విద్యుత్ వినియోగడం ఏ నెల ఎంత పెరిగిందో చూసుకుని పొదుపుగా వాడుకునే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ పేమెంట్ హిస్టరీ: ఆన్‌లైన్ ద్వారా చెల్లించిన బిల్లు వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యముంది.
కొత్త సర్వీస్ స్థితి: కొత్త సర్వీసుల రిలీజ్ స్థితిగతులు ఎప్పటికప్పుడు అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి తెలుసుకునే సౌకర్యం ఉంది. తద్వారా కొత్త సర్వీసుల మంజూరు వేగంగా జరుగుతుంది.
లింక్ ఆధార్– మొబైల్: వినియోగదారుల ఆధార్, మొబైల్ నంబర్లు లింక్‌తో విద్యుత్ బిల్లుల సమాచారం ఫోన్‌కు చేరుతుంది. దీంతో గడువులోగా బిల్లులు చెల్లించవచ్చు
కొత్త కనెక్షన్, పేరుమార్పు: కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవడానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇందులో పొందుపరిచారు. దీంతోపాటు విద్యుత్ మీటర్ పేరు మార్పు, లోడ్‌కు సంబంధిందించిన వివరాలు ఇందులో ఉన్నాయి.
పవర్ కంజష్షన్ గైడ్ లైన్స్: విద్యుత్ ఉపకరణాలు ఎంత వాడితే ఎంత విద్యుత్ వినియోగం అవుతుందో ఇందులో వివరించారు.
టారిఫ్ డీటెయిల్స్: విద్యుత్ వినియోగం చార్జీల వివరాలు కేటగిరీల వారీగా ఇందులో ఉంటాయి. గృహ, గృహేతర వినియోగదారులు, పరిశ్రమలు, ఇతర కేటగిరీల వారీగా చార్జీల వివరాలు ఇందులో పొందుపరిచారు.
ఎనర్జీ సేవింగ్, సేఫ్టీ టిప్స్: విద్యుత్ ఉపకరణాలు వాడుతున్నపుడు పాటించాల్సిన పొదుపు సూచనలు, విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇందులో వివరించారు.
ఫీడ్ బ్యాక్: వినియోగదారులకు అందిస్తున్న సేవలపై అభిప్రాయాన్ని పంచుకోవచ్చు. ఇది చాలా ముఖ్యం. సలహాలను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకొని మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది.
మై అకౌంట్: మై అకౌంట్‌లో వినియోగదారుల పూర్తి వివరాలు ఉంటాయి. వారి మీటర్ తాలూకు వివరాలు, తదితర సమాచారం ఉంటుంది.
వినియోగదారుల బిల్లు సమాచారం: దీనిలో వినియోగదారుల సర్వీస్ నంబర్ నమోదు చేసి బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు.
అధికారి వివరాలు: వినియోగదారుల పరిధిలోని అధికారి వివరాలు ఈ యాప్ ద్వారా తెలుసుకోచ్చు. వినియోగదారులకు ఎటువంటి సందేహాలున్న తమ పరిధిలోని అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.
కాంటాక్ట్ ఆజ్: ఇందులో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు 1800 4250028, 1912 ఉంటాయి. వీటిద్వారా సమస్యలు త్వరగా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది.
యాప్‌తో అనేక ప్రయోజనాలు
టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని సేవలు పొందొచ్చు. కార్యాలయాలకు రావాల్సిన సమయం, ఖర్చులు ఆదా అవుతాయి.
– గౌతం రెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్‌ఈ వరంగల్
యాప్‌పై అవగాహన కల్పిస్తున్నాం
టీజీ ఎన్పీడీసీఎల్ యాప్‌పై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం. అరచేతిలోకి విద్యుత్ సేవలు తీసుకెళ్లడానికి ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి యాప్‌ను ఆధునికీకరించి 20 రకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
– మధుసూదన్‌రావు,
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ, హనుమకొండ
●
విద్యుత్ సేవలు
విద్యుత్ సేవలు
విద్యుత్ సేవలు