మహబూబ్‌నగర్: పట్టణంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపర్చిన ఆడ జెర్రిపోతు పాము శుక్రవారం పది గుడ్లను పెట్టిందని వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.సదాశివయ్య శనివారం విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. సాధారణంగా కొన్ని పాములు గుడ్లను పెడతాయి. మరికొన్ని ప్రత్యక్షంగా పిల్లలను కంటాయి.
అయితే ప్రజలు జెర్రిపోతును మగదిగాను నాగుపామును ఆడదిగాను అపోహపడుతుంటారన్నారు. కానీ జెర్రిపోతు పాముల్లో ఆడ, మగ ఉంటాయని తెలియజేశారు. ఐదు రోజుల క్రితం పట్టణంలోని ఓ ఇంట్లో పట్టుకు వచ్చిన ఆడ జెర్రిపోతును కళాశాల వృక్షశాస్త్రవిభాగంలో భద్రపరిచారు. శుక్రవారం రాత్రి పాము పది గుడ్లను పెట్టిందని తెలిపారు.
గుడ్లను పొదిగించేందుకు సరైన పరికరాలు కళాశాలలో లేనందున హైదరాబాద్ అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాలలోని జీవ వైవిధ్య పరిశోధన విద్యా కేంద్రంలో ఇప్పటికే మూడు సార్లు గుడ్లను హైదరాబాద్ పంపగా అవి పిల్లలు తీశాయని ప్రిన్సిపాల్ డా. అప్పియాచిన్నమ్మ తెలిపారు. సాధారణంగా జెర్రిపోతు పాములు జూలై, ఆగస్టు నెలల్లో ఒక్కో పాము 6 నుంచి 22 వరకు గుడ్లు పెడతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment