మహబూబ్‌నగర్ క్రైం: రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో బెల్టు దుకాణాలను మూసివేస్తామని ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించి పల్లెల్లో ఉన్న బెల్టు దుకాణాలను మూసి వేయించాలని సంబంధిత ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాలు, 38 బార్లు ఉండగా.. వీటి ద్వారా ఏటా రూ.2 వేల కోట్లకుపైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ నెల 1 నుంచి కొత్తగా లైసెన్స్‌లు పొందినవారు దుకాణాలను ప్రారంభించారు. గ్రామాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉండటం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులే నిత్యం పార్టీ కార్యకర్తలకు, ఇతరులకు మద్యం పంచడంతో గత రెండు నెలల నుంచి బెల్టు దుకాణాలను ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు.
అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో కొన్నిచోట్ల బెల్టు దుకాణాలు బహిరంగంగా తెరవకపోయినా రాత్రివేళలో రహస్యంగా విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందు ఒక్కో గ్రామంలో తక్కువగా మూడు వరకు బెల్టు దుకాణాలు ఉండేవి.
అధికారుల పాత్ర..
ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే మద్యం విక్రయించాలి. అంటే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మడం చట్టరీత్యా నేరం. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏకంగా వేల సంఖ్యలో బెల్టు దుకాణాల్లో విక్రయాలు సాగించారు. ఆ స్థాయిలో బెల్టు దుకాణాలు ఉన్నాయంటే సంబంధిత అధికారుల పాత్ర ఎంత ఉంటుందో అర్థమవుతుంది.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న 230 మద్యం దుకాణాల నుంచి బెల్టు షాపుల యజమానులు మద్యం పరిమాణం, బ్రాండ్‌ను బట్టి రూ.10– 20 వరకు ఎక్కువగా అమ్ముతుండగా.. పల్లెల్లో బెల్టు దుకాణాల నిర్వాహకులు దానిని రూ.70– 100 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
దీంతో ఒక్కో మద్యం దుకాణానికి వీటి ద్వారా నెలకు రూ.1.50 లక్షల వరకు అదనంగా ఆదాయం వస్తోందని అనధికార అంచనా. ఇలా సుమారు 3 వేలకుపైగా బెల్టు దుకాణాల్లో విక్రయించే మద్యం విలువ నెలకు రూ.350 కోట్లపైమాటే.
మరోవైపు దాబాల్లోనూ విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాబాలు మూతపడినా.. కొన్నిచోట్ల రాత్రివేళలో నడుపుతున్నారు. కొత్త ప్రభుత్వ నిర్ణయంతో ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి దాబాలతోపాటు పల్లెల్లో మద్యం పారిస్తున్న బెల్టు దుకాణాలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది.
చర్యలు తీసుకుంటాం..
ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా దృష్టిపెడతాం. – దత్తురాజ్‌గౌడ్,డీసీ ఎక్సైజ్‌శాఖ, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment