రాంరాయనిపల్లి సమీపంలోని గుట్టనుపరిశీలిస్తున్న ఫారెస్టు అధికారులు
ఖిల్లాఘనపురం: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని రాంరాయనిపల్లి (మల్కిమియాన్‌పల్లి) గ్రామ సమీపంలో చిరుతల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా రెండు చిరుతలు సంచరిస్తుండటంతో హడలెత్తిపోతున్నారు. రాంరాయనిపల్లి సమీపంలోని బోడగట్టు వద్దనున్న సందపురం వెంకట్‌రెడ్డి పశువుల పాక వద్ద శుక్రవారం ఉదయం రెండు చిరుతలు కనిపించాయి.
విషయాన్ని గ్రామపెద్ద సాయిలు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో సెక్షన్ ఆఫీసర్ భాస్కరాచారి, సిబ్బంది అంజనేయులు గుట్టపైకి వెళ్లి పరిశీలించారు. చిరుతల జాడ దొరక్కపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీరా సాయంత్రం అదే గుట్టపై చిరుత కనిపించడంతో హీర్లతండాకు చెందిన కొందరు దూరం నుంచి వీడియో తీశారు.
చిరుతల సంచారంతో రాంరాయనిపల్లితో పాటు హీర్లతండా, అల్లమాయపల్లి, వసురాంతండా, సూర్యతండా, దేవబండతండా, నేలబండతండా, అప్పారెడ్డిపల్లి తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.
దూడలపై చిరుత దాడి
నవాబుపేట: నవాబుపేట మండలంలోని యన్మన్‌గండ్ల శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం గ్రామ శివారులోని గుట్ట పక్కనున్న పొలాల్లో రైతులు దూడలను కట్టేయగా.. అర్ధరాత్రి సమయంలో చిరుత దాడిచేసి గాయపర్చింది.
శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు.. రక్తపు మడుగులో ఉన్న దూడలను చూసి భయాందోళనకు గురయ్యారు. మొత్తం నాలుగు దూడలపై దాడి చేసినట్లు రైతులు తెలిపారు. చిరుత బారి నుంచి మూగజీవాలను కాపాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment