కృష్ణా: మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలును నిలపాలని కోరుతూ బుధవారం అఖిలపక్ష నాయకులు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ కుమార్ జైన్‌కు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు నల్లబ్యాడ్జీలు ధరించి రైల్వేస్టేషన్ ఎదుట నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, బీజేపీ జాతీయ నాయకుడు అమర్‌కుమార్ దీక్షిత్ మాట్లాడుతూ.. కరోనా కాలం కంటే ముందు ఇక్కడ ప్రతి రైలును నిలిపేవారని తెలిపారు. కృష్ణా గ్రామ సమీపంలోని కృష్ణానదీ తీరంలో పిండ ప్రదానం కోసం ముంబై, బెంగళూరు, గుజరాత్ తదితర ప్రాంతాల భక్తులు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చేవారని గుర్తుచేశారు. కరోనా కాలం తర్వాత కృష్ణా స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపకుండా వెళ్తుండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారన్నారు. రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రులు, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా ప్రజల అవసరాలను గుర్తించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌గౌడ్, ఉమ్మడి మండల అధ్యక్షుడు నర్సప్ప, నాయకులు మహాదేవ్, నాగేష్, కిష్టప్ప, శంకరప్ప, శంకర్, శక్తిసింగ్ పాల్గొన్నారు.
దక్షిణమధ్య రైల్వే జీఎంకు విన్నవించిన అఖిలపక్ష నాయకులు