మహబూబ్‌నగర్ క్రైం: వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థికి జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్యసిబ్బంది ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇవ్వడం వల్లే శ్వాసలో ఇబ్బంది ఏర్పడి మృతి చెందాడని కుటుంబసభ్యులు, స్నేహితులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థి సంఘాల నాయకులు అధికంగా రావడంతో కొంత సమయం ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తంగా మారింది. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. జడ్చర్లకు చెందిన రవీంద్ర(23) విద్యార్థి వ్యక్తిగత కారణాల వల్ల శుక్రవారం 11 డోలో 650 ట్యాబ్‌లెట్స్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబసభ్యులు చికిత్స కోసం అదేరోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో మృతి చెందాడు. చికిత్స చేస్తున్న క్రమంలో అతనికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యసిబ్బంది బయటకు రాసి ఇవ్వగా.. తీసుకొచ్చి ఇంజక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఆ ఇంజక్షన్ వికటించడం వల్లే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడి మృతి చెందాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న రవీంద్ర స్నేహితులు, బంధువులు భారీస్థాయిలో ఆస్పత్రి దగ్గర చేరారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్‌తో పాటు వన్‌టౌన్ సీఐ అప్పయ్య ఇతర పోలీసులు ఆస్పత్రికి చేరుకుని గొడవ చేస్తున్న యువకులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. మృతుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రవీంద్ర మృతిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, పోస్టుమార్టం తర్వాత మరణంపై అన్ని రకాల విషయాలు తెలుస్తాయని దాని ప్రకారం విచారణ పూర్తి చేస్తామని ఆర్‌ఎంఓ డాక్టర్ సమత వెల్లడించారు.
వ్యక్తిగత కారణాలతో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
చికిత్సపొందుతూ మృతి.. వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు
ఇంజక్షన్ మార్చి ఇవ్వడం వల్లే చనిపోయాడని ఆస్పత్రి ఎదుట ఆందోళన
ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ చేయిస్తాం: సూపరింటెండెంట్
జనరల్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత