స్టేషన్ మహబూబ్‌నగర్: ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టనున్నట్లు సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జైబాపు, జైభీమ్, జైసంవిదాన్ అభియాన్ రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశాన్ని ఇటీవలే నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాల సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయని, ఈనెల 28 లోపు మండలస్థాయిలో కూడా నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై వందేళ్లు పూర్తయిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతుందన్నారు. అంబేద్కర్‌ను పార్లమెంట్‌లో కేంద్రహోంమంత్రి అమిత్‌షా అత్యంత హీనంగా అవమానపర్చారని అన్నారు. అమిత్‌షా రాజీనామా చేయాలని కాంగ్రెస్‌తో పాటు దేశ ప్రజలందరూ డిమాండ్ చేశారని, కానీ ఆయన చేయలేదన్నారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏడాది పాటు ప్రతి గ్రామాన్ని సందర్శించేలా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. సన్నాహక సమావేశాలు అనంతరం ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్ల పాదయాత్రలు పూర్తిచేసి మండల కేంద్రం లేదా ఏదైనా పెద్ద గ్రామ పంచాయతీలో ముగింపు సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జైబాపు, జైభీమ్, జైసంవిధాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సతీష్, మార్కెట్ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, మీడియా కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు చంద్రకుమార్‌గౌడ్, సంజీవ్ ముదిరాజ్, ఎన్‌పీ వెంకటేశ్ పాల్గొన్నారు.
ఏడాది పాటు జై
బాపు, జై భీమ్,
జై సంవిధాన్ కార్యక్రమం
సీడబ్ల్యూసీ ప్రత్యేక
ఆహ్వానితులు
చల్లా వంశీచంద్‌రెడ్డి